పంటరుణాలు వెంటనే రెన్యూవల్ చేయాలి
సాక్షి, సంగారెడ్డి: రెండవ విడత రుణ మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగానే బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు రెన్యూవల్ చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.వి.రమణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. రెండవ విడత రుణ మాఫీ, పంట రుణాల రెన్యూవల్, వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే రెండవ విడత రుణ మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా బ్యాంకర్లు రైతులకు పంట రుణాలను రెన్యూవల్ చేయాలని సూచించారు.
రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పంటరుణాలతోపాటు రైతులు పాలీహౌజ్, సోలార్ పంపుసెట్లు, ఫామ్ మెకనైజేషన్ పథకం కింద రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే వారికి బ్యాంకర్లు మంజూరు లేఖలు త్వరితగతిన అందజేయాలని సూచించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు 90 స్కీంలు అందజేశామని, మిగతా పదిశాతం ఈనెలాఖరులోగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం డెరైక్టర్ మేఘరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వేల మంది యువకులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ఉచిత శిక్షణ అందజేసినట్లు వివరించారు. ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు బ్యాంకర్లు రుణాలు అందజేసి ప్రోత్సహించాలని కోరారు. స్వయం ఉపాధి పొందేందుకు రుణాలందించాలన్నారు. యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.50 వేల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ హుక్యానాయక్, డీఆర్డీఏ ఏపీడీ వెంకటేశ్వర్లు, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రుణాల రికవరీలో ముందంజలో వుండాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ : బ్యాంకు లింకేజీల ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ చేయడంలో ముందంజలో వుండాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో వుందని అన్నారు. వచ్చే నెలలో అదనంగా మరికొన్ని స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. సబ్సిడీ శాతాన్ని తగ్గించడం వల్ల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదన్నారు. దాని వల్ల నిర్దేశించిన లక్ష్యాలను చేరలేకపోతున్నామన్నారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో రికవరీ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. డీఆర్ డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దాని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మహిళా సమాఖ్య ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించనున్న హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.