పక్కా ప్రణాళికతో ‘స్వచ్ఛ సిరిసిల్ల’
26వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి
► వార్డుల్లో కౌన్సిలర్ల సహకారం అవసరం
► జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా
►సిరిసిల్ల మున్సిపల్ అత్యవసర సమావేశం
సిరిసిల్ల టౌన్: జిల్లా కేంద్రాన్ని ‘స్వచ్ఛ సిరిసిల్ల’గా మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పక్కా ప్రణాళికను అనుసరిస్తుందని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. జిల్లా ముఖచిత్రమైన సిరిసిల్లలో నూరుశాతం ఐఎస్ఎల్ సాధించాల్సిన అవసరం ఉందని ఇందుకు అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల పాత్ర ఉండాలని సూచించారు. నూరుశాతం శానిటేషన్ కోసం గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో 2వేల వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టాల్సినట్లుగా గుర్తించినా వివిధ కారణాలతో వాటి గణాంకాలు రెండింతలు పెరిగిందదన్నారు. ఈనెల 26వరకు పట్టణంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎస్ఎల్ నిర్మాణాలకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందుతుందన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూరుశాతం ఐఎస్ఎల్ ప్రకటించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ సిరిసిల్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలతో సంఘటితంగా ముందుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలన్న మంత్రి కేటీఆర్ ఆశయానికి అందరూ సహకరించాలని కోరారు. నోట్లరద్దు తదితర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాశయాన్ని అధికారులు, కౌన్సిలర్లు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ దృష్టి సారిస్తే నూరుశాతం శానిటేషన్ సాధన పెద్దసమస్య కాదని స్పష్టం చేశారు. స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను కౌన్సిలర్లు ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బడుగు సుమన్ రావు, ప్రత్యేకాధికారి శ్రీధర్, డీఈఈ ప్రభువర్ధన్ రెడ్డి, వైస్‌చైర్మన్ తౌటు కనుకయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.