స్వాతి-నరేశ్: పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: సంచలనం రేపిన స్వాతి-నరేశ్ కేసులో తెలంగాణ పోలీసులు గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నరేష్ ఆచూకీ తెలుపాలంటూ అతని తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. పరువుహత్యల వ్యవహారంలో పోలీసులు మెజారిటీ ప్రజల పక్షాన ఎందుకు నిలబడటం లేదంటూ నిలదీసింది. ఈ కేసు దర్యాప్తులో ఏమైనా అనుమానాలుంటే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని నరేశ్ తల్లిదండ్రులకు హైకోర్టు సూచించింది.
స్వాతి-నరేశ్ కేసులో హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే చంపాడు. అతని హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా నరేశ్ అస్థికలను మూసీ నదిలో కలిపాడు. ఆ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుంది. నరేష్ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నాం.నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నాం. ఆత్మకూరు ఎస్సైను సస్పెండ్ చేశాం’ అని పోలీసులు ఈ నివేదికలో వెల్లడించారు. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపై పలు అనుమానాలు ఉన్నాయని, వారు దర్యాప్తును సరైనరీతిలో నిర్వహించడంలేదని నరేశ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.