ఊరూవాడా సంక్రాంతి సంబరాలు
అనంతపురం సెంట్రల్ : సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఊరువాడా సంబరాలు నిర్వహించాలని అడిషనల్ జాయింట్ కలెక్టరు సయ్యద్ ఖాజామొహిద్దీన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాల వేదికైన పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు.
వేదికను సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వంటలు, ముగ్గులు, కబడ్డీ పోటీలను నిర్వహించాలని చెప్పారు. పంటలు, పశువుల ప్రదర్శన, ప్రభుత్వ శాఖలకు సబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆహూతులను ఆకట్టుకునే విధంగా సంప్రదాయ కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని చె ప్పారు. పతంగులను ఎగురవేయాలన్నారు.
కార్యక్రమంలో సమాచార శాఖ, సహాయ సంచాలకులు వై.వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జాయింట డెరైక్టర్ శ్రీరామమూర్తి, అనంతపురం ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఉద్యానవనశాఖ డీడీ సుబ్బరాయుడు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, సమాచారశాఖ డీఈ నాగభూషణం, ఐసీడీఎస్, అగ్నిమాపకశాఖ, ఆర్అండ్బీ, డీఆర్డీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు.
12, 13 తేదీల్లో గవర్నర్ పుట్టపర్తి, కదిరిలో పర్యటన
అనంతపురం సెంట్రల్ : గవర్నర్ నరసింహన్ ఈనెల 12, 13వ తేదీల్లో పుట్టపర్తి, కదిరి పర్యటిస్తారని ఏజెసీ సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని రెవిన్యూభవన్‌లో గవర్నర్ పర్యటన, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని చెప్పారు.
గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు
66వ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఏజేసీ అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 15లోపు సమాచార శాఖ, సహాయ సంచాలకులకు పంపాలన్నారు. 20వ తేదీలోపు అవార్డులకు ఉద్యోగుల పేర్లు సిఫార్సు చేయాలని సూచించారు. ప్రగతిని సూచించే స్టాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ హేమసాగర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఆర్డీవోలు హుస్సేన్‌సాహెబ్, రాజశేఖర్, రామారావు, సెరికల్చర్ జెడీ అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీపీవో రమణ, డీయంఅంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు.