ఇరు దేశాలకు 'ఆమె' కూతురు
న్యూఢిల్లీ: కరాచీ నుంచి ఢీల్లీకి తీసుకొచ్చిన గీత ... భారత పాకిస్తాన్ దేశాల మైత్రికి, ఐక్యతకు గుర్తు అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తప్పిపోయి పాకిస్థాన్లో ఆశ్రయం పొందిన మూగ బాలిక గీత (23) మంగళవారం రాష్ట్రపతి భవన్ లో దేశాధ్యక్షుణ్ని కలిసింది. ఇరుదేశాలకు కూతురు లాంటిదంటూ గీతను ఆయన ఈ సందర్భంగా ఆశీర్వదించారు.
అంతేకాకుండా దేవుడు నీ ప్రార్థనలు విన్నాడంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. మరోవైపు గీతను కంటి రెప్పలా కాపాడుతున్న ఈదీ ఫౌండేషన్ సభ్యులకు ప్రణబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గీత భారత్-పాకిస్థాన్ దేశాల ఐక్యతకు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఎనిమిదేళ్ల వయస్సులో సంఝౌతా ఎక్స్ప్రెస్లో మూగ, బధిర బాలిక గీత పాకిస్తాన్లోని లాహోర్ చేరింది. గత పదిహేనేళ్లుగా ఆమె కరాచీలోని ఈదీ ఫౌండేషన్ సంరక్షణలో సురక్షితంగా ఉంది. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈదీ ఫౌండేషన్ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే గీత కుటుంబ సభ్యులు గుర్తింపు ప్రక్రియ అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.