Sympathisers
-
పట్టుబడిన మావోయిస్టులు, సానుభూతిపరులు.. ఎందుకొచ్చినట్లు!?
సాక్షి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌నుంచి మావోయిస్టులు వరంగల్ నగరానికి ఎందుకు వచ్చారు..? వైద్యం కోసం వస్తే గుట్టుచప్పుడు కాకుండా ఒక్కరో ఇద్దరితోనే ఆస్పత్రికి రావాలి.. మరి బొలెరో వాహనంలో ఐదుగురు ఎందుకు వచ్చినట్లు? వెంట పేలుడు పదార్థాలు ఎందుకు ఉన్నాయి? వీటన్నింటిని పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ నక్సల్స్ విస్తరణలో భాగంగా నగరంలో పాగా వేసేందుకు ప్రయత్నించారా? మరేదైనా యాక్షన్‌కు ప్లాన్ చేశారా? అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న మావోయిస్టులు సోమవారం వరంగల్ పోలీసులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కంచుకోటలాంటి వరంగల్‌లో కొన్నేళ్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఈ సమయంలో ఇద్దరు మావోయిస్టులతోపాటు ముగ్గురు సానుభూతిపరుల అరెస్ట్ కలకలం రేపింది. మడకం ఉంగి అనేక కేసుల్లో నిందితురాలు.. పోలీసులకు చిక్కిన మడకం ఉంగి అలియాస్ కమల వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళా మావోయిస్టు. విప్లవ సాహిత్యం, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలై 2007 వరకు బాలల సంఘంలో పనిచేసి, 2011లో ముసాకి చంద్రు నాయకత్వంలో మిలీషియా సభ్యురాలిగా పనిచేసింది. అదే ఏడాది పామెడు ఎల్జీఎస్ కమాండర్ బొద్దె కిషన్ అధ్వర్యంలో ఎన్డీఎస్ సభ్యురాలిగా పనిచేసింది. 9వ ప్లాటూన్‌లో, 2012 సంవత్సరంలో సౌత్ సబ్ జోనల్ బ్యూరో టీం ఇన్చార్జ్గా నియమితులైంది. వివిధ ఘటనల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేది. 2017 ఏప్రిల్‌లో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ బుర్కా పాల్ ఆటవీ ప్రాంతంలో దాడిచేసి 25మంది పోలీసులను హత్య చేసిన çఘటనలో నిందితురాలు. 2018లో మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులను హత్యచేసి మరో ఆరుగురిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన, 2020 మార్చిలో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని మినప అడవి ప్రాంతంలో 17మంది, 2021లో బెటాలియన్ కమాండర్ హిడ్మా, సాగర్ నాయకత్వంలో గుట్టపరివార ప్రాంతంలో ఆడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 24మంది బీజాపూర్ పోలీసులను హత్యచేసిన çఘటనల్లో నిందితురాలు. మరో మావోయిస్టు అసం సోహెన్ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ప్రసంగాలు, పాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 2019లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి, నేషనల్ పార్క్ ఏరియా సెక్రటరీ దిలీప్ వింజ ఆధ్వర్యంలో సభ్యుడిగా నియామకమయ్యాడు. బీడీ ఆకుల కాంట్రా క్టర్లు, ఇతర సంపన్న వ్యక్తులనుంచి పార్టీ ఫండ్ పే రుతో డబ్బు వసూలు చేసి పార్టీకి అవసరమైన ని త్యావసరాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి అందజేసేవాడు. దీంతోపాటు పేలుడు పదార్థాలను వరంగల్, కరీంనగర్ ప్రాంతాలనుంచి రహస్యంగా కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. వీరితోపాటు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘ్ అధ్యక్షురాలు మీచ అనిత (21), (భూపాలపట్నం తాలూకా కండ్లపర్తి గ్రామం), ఆర్పీసీ సభ్యుడు గొడ్డి గోపాల్ (భూపాలపట్నం తాలూకా వరదల్లి గ్రామం), భూపాలపట్నం తాలూకా నల్లంపల్లికి చెందిన కందగుర్ల సత్యం ఉన్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, సెల్ఫోన్లు, నగదు ఛత్తీస్‌గఢ్ టు వరంగల్, వయా ములుగు మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అరెస్టయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నం తాలూకా నుంచి ములుగు జిల్లా మీదుగా వరంగల్ నగరానికి చేరినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం, ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదివారం సాయంత్రం సమయంలో ములుగు రోడ్డు అజర హాస్పిటల్ ప్రాంతంలో వరంగల్ టాస్క్‌ఫోర్స్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో కారులో వస్తూ పట్టుబడ్డారు. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతిపరులుగా గుర్తించారు. వారినుంచి 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, రూ.74వేల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బొలెరో కారు, సెల్ఫోన్లు, ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను స్వా«ధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నక్సలైట్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, హనుమకొండ ఇన్స్పెక్టర్లు సురేశ్ కుమార్, శ్రీనివాస్‌జీ, హనుమకొండ ఎస్ఐలు, ఇతర సిబ్బందిని సెంట్రల్ డీసీపీ అభినందించారు. పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు -
టీడీపీ నేతలు చెప్పినట్లు చెలరేగుతున్న పోలీసులు
సాక్షి, గుంటూరు/పట్నంబజారు (గుంటూరు): టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆగమేఘాల మీద కేసులు పెడుతున్నారు. ఏ జిల్లా పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అన్న కనీస సమాచారం కూడా చెప్పకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు నిత్యం ఏదో ఒక జిల్లాకు చెందిన యువకులను అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. కారణం అడిగితే సోషల్ మీడియాలో సీఎంను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టారని చెబుతున్నారు. ఏవైనా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులకు కనీస సమాచారం ఇవ్వాలన్న ధర్మాన్ని పోలీసులు పాటించడంలేదు. కుటుంబసభ్యులకు చెప్పకుండా యువకులను అరెస్ట్ చేసి తీసుకెళుతున్నారు. దీంతో ఆ యువకుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు, బంధువులు ఒకటి, రెండు రోజులు ఇబ్బందులు పడుతున్నారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని ఆదివారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరుకు చెందిన కాలేషావలి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన గుదిబండి గోపి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలానికి చెందిన పత్రి నరేశ్, కృష్ణాపురానికి చెందిన పెద్దిరెడ్డి రామకృష్ణ ఉన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే ఈ యువకులపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. అరెస్ట్ చేసిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన పత్రి నరేశ్ ఐదో తరగతి వరకు చదివి, గ్రామాల్లో చిలకజోస్యం చెప్పుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి స్మార్ట్ ఫోన్ కూడా లేకపోవడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం) న్యాయవాదులను హేళన చేసిన పోలీసులు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై పోస్టులు పెట్టారంటూ కొందరిని అరెస్టు చేసిన గుంటూరు అరండల్‌పేట పోలీసులు ఆదివారం బెయిల్ కోసం వెళ్లిన బాధితుల బంధువులు, న్యాయవాదులతో అనుచితంగా ప్రవర్తించారు. బెయిల్ ఇచ్చేది లేదు.. ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హేళనగా మాట్లాడారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ గుంటూరు కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వీరిని చూసి రెచ్చిపోయిన పోలీసులు స్టేషన్ ఎదుట నిలబడకూడదంటూ హెచ్చరించారు. న్యాయవాదులతో అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బ్రహ్మయ్య వాగ్వాదానికి దిగారు. పోలూరి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతల రాస్తారోకో తమ పార్టీకి చెందిన పలువురు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి, టీడీపీ నేత యామిని ఆదేశాల మేరకు తీవ్రంగా కొట్టి గాయపరిచారంటూ జనసేన నేతలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినలేదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని మా సోదరుడి కుమారుడు కాలేషావలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అతడి సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినిపించుకోలేదు. మా అమ్మాయి నిశ్చితార్థ కార్యక్రమాలు వదిలేసి మేం ఇప్పుడు స్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తున్నాం. గుంటూరు అరండల్‌పేట స్టేషన్‌కు తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్లన్నీ తిప్పారు. దీంతో మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అని తిరగని స్టేషన్ లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం. – షేక్ మీరావలి, కాలేషావలి బాబాయి -
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో 57 మంది మావోయిస్టులు, 297 మంది సానుభూతి పరులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 17 మందిపై ఉన్న క్యాష్ రివార్డును వారికే అందిస్తామని, మిగతావారికి ప్రోత్సాహకంగా నగదును అందిస్తామని సుక్మా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు కెర్లాపాల్, మజిపరా, పొటాంపురా.బోర్గుడా, గొండ్ పల్లి మొసంపురా, జీరాంపల్, బాదేసట్టి, పొందుపరా గ్రామాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఎస్పీ తెలిపారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 1,400 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.