టీడీపీ నేతలు చెప్పినట్లు చెలరేగుతున్న పోలీసులు | Andhra Pradesh Cops Harassing YSRCP Sympathisers | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు చెప్పినట్లు చెలరేగుతున్న పోలీసులు

Published Mon, Mar 4 2019 11:18 AM | Last Updated on Mon, Mar 4 2019 4:14 PM

Andhra Pradesh Cops Harassing YSRCP Sympathisers - Sakshi

అరెస్టయిన యువకులు

సాక్షి, గుంటూరు/పట్నంబజారు (గుంటూరు): టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆగమేఘాల మీద కేసులు పెడుతున్నారు. ఏ జిల్లా పోలీసులు.. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అన్న కనీస సమాచారం కూడా చెప్పకుండా అరెస్ట్‌ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.  పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు నిత్యం ఏదో ఒక జిల్లాకు చెందిన యువకులను అరెస్ట్‌ చేయడం పరిపాటిగా మారింది. కారణం అడిగితే సోషల్‌ మీడియాలో సీఎంను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టారని చెబుతున్నారు. ఏవైనా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులకు కనీస సమాచారం ఇవ్వాలన్న ధర్మాన్ని పోలీసులు పాటించడంలేదు. కుటుంబసభ్యులకు చెప్పకుండా యువకులను అరెస్ట్‌ చేసి తీసుకెళుతున్నారు. దీంతో ఆ యువకుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు, బంధువులు ఒకటి, రెండు రోజులు ఇబ్బందులు పడుతున్నారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!)

సీఎం చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని ఆదివారం అరెస్టు చేశారు. అరెస్ట్‌ చేసిన వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరుకు చెందిన కాలేషావలి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన గుదిబండి గోపి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన పత్రి నరేశ్, కృష్ణాపురానికి చెందిన పెద్దిరెడ్డి రామకృష్ణ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే ఈ యువకులపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. అరెస్ట్‌ చేసిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన పత్రి నరేశ్‌ ఐదో తరగతి వరకు చదివి, గ్రామాల్లో చిలకజోస్యం చెప్పుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి స్మార్ట్‌ ఫోన్‌ కూడా లేకపోవడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం)

న్యాయవాదులను హేళన చేసిన పోలీసులు
సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబుపై పోస్టులు పెట్టారంటూ కొందరిని అరెస్టు చేసిన గుంటూరు అరండల్‌పేట పోలీసులు ఆదివారం బెయిల్‌ కోసం వెళ్లిన బాధితుల బంధువులు, న్యాయవాదులతో అనుచితంగా ప్రవర్తించారు. బెయిల్‌ ఇచ్చేది లేదు.. ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హేళనగా మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ గుంటూరు కన్వీనర్‌ పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సోషల్‌ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. వీరిని చూసి రెచ్చిపోయిన పోలీసులు స్టేషన్‌ ఎదుట నిలబడకూడదంటూ హెచ్చరించారు. న్యాయవాదులతో అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బ్రహ్మయ్య వాగ్వాదానికి దిగారు.  పోలూరి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన నేతల రాస్తారోకో
తమ పార్టీకి చెందిన పలువురు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్‌ చేసి, టీడీపీ నేత యామిని ఆదేశాల మేరకు తీవ్రంగా కొట్టి గాయపరిచారంటూ జనసేన నేతలు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేశారు.

సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినలేదు..
సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని మా సోదరుడి కుమారుడు కాలేషావలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం అతడి సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినిపించుకోలేదు. మా అమ్మాయి నిశ్చితార్థ కార్యక్రమాలు వదిలేసి మేం ఇప్పుడు స్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తున్నాం. గుంటూరు అరండల్‌పేట స్టేషన్‌కు తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్లన్నీ తిప్పారు. దీంతో మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అని తిరగని స్టేషన్‌ లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసం.        
 – షేక్‌ మీరావలి, కాలేషావలి బాబాయి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement