system is ideal for the farmer
-
‘ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే’
-
‘ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే’
కవాడిగూడ: ఆదర్శ రైతు వ్యవస్థను రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలని, లే కపోతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతమవుతాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డిలు హెచ్చరించారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆదర్శ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో గురువారం మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు హాజరయ్యారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడం రైతు లోకానికే అవమానకరమన్నారు. ఆదర్శ రైతులకు, రైతు సంక్షేమానికి నిధుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం పోలీసు వాహనాలకు రూ.340 కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదని తన క్యాంపు కార్యాలయానికి రూ.26 కోట్లు ఎలా మంజూరు చేయించుకున్నారని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. సోనియాను దేవత అని పొగిడి సన్మానం చేస్తానన్న కేసీఆర్ నేడు సానియాకు సన్మానం చేస్తున్నారని దుయ్య బట్టారు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎంతో మందిని రోడ్డున పడేయడానికి పూనుకున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీల ముద్రవేసి ఆదర్శ రైతులను తొలగించడం సరైంది కాదన్నారు. 30న కలెక్టర్ కార్యాలయాల ముట్టడి ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆ సంఘాల కమిటీలు ఈ నెల 30నఅన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతు సంఘాల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ఎన్.శేఖర్, ఏపీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, నాయకులు సామినేని రాము, వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ రైతులకు మంగళం
జీవో నంబరు 43 విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాలో 1,750 మంది ఇంటిముఖం ఎంపీఈవోల వ్యవస్థ తెచ్చే యోచనలో సర్కారు నూజివీడు : ‘జాబు కావాలంటే బాబు రావాలి...’ ఇది ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పదేపదే వల్లెవేసిన మాట... బాబు అధికారంలోకి వచ్చారు. కానీ, కొత్తవారికి జాబు రాకపోగా, ఉన్న వారిని కూడా ఇంటికి పంపించేస్తున్నారు. ఇప్పటికే గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపిన టీడీపీ ప్రభుత్వం... తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తూ శుక్రవారమే జీవో నంబరు 43ను విడుదల చేసింది. దీంతో జిల్లాలో దాదాపు 1,750 మంది ఆదర్శ రైతులు ఇంటిముఖం పట్టనున్నారు. రైతులు, అధికారులకు వారధిగా... రైతులకు, వ్యవసాయాధికారులకు మధ్య సంధానకర్తగా పనిచేసేందుకు 2007లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను ఏర్పాటు చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని ప్రతి 250 రైతు కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించింది. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లించేవారు. వీరికి దాదాపు రూ.10 లక్షల వ్యయంతో పలుమార్లు శిక్షణనిచ్చి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారినే కొనసాగిస్తూ, పనితీరు బాగోలేని వారిని తొలగిస్తూ వచ్చింది. నియమితులైన ఆదర్శ రైతులు వ్యవసాయాధికారులకు, రైతులకు మధ్య వారధిలా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రైతుచైతన్య యాత్రలకు రైతులు వచ్చేలా చూడటం, యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేయడం, వ్యవసాయ శాఖ అమలుపరిచే పలు విషయాలను సకాలంలో రైతులకు తెలియజేయడం వంటి పనులు వీరు చేస్తున్నారు. తుపాను బారిన పడిన పొలాలకు వెళ్లి దెబ్బతిన్న పంటల నమోదులోనూ వ్యవసాయాధికారులకు తమ సహకారాన్ని అందించేవారు. ఈ ఆదర్శ రైతు వ్యవస్థను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చారనే అక్కసుతో దీనిని రద్దు చేస్తారనే ప్రచారం టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మళ్లీ పాత విధానమే... 1999-2004 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో బహుళ ప్రయోజన విస్తరణాధికారుల(ఎంపీఈవో)ను కాంట్రాక్టు పద్ధతిపై నియమించింది. అగ్రికల్చర్ బీఎస్సీ చదివినవారు ఐదువేల ఎకరాల విస్తీర్ణానికి ఒకరు చొప్పున మండలానికి నలుగురు నుంచి ఆరుగురు వరకు పనిచేసేవారు. వీరు వ్యవసాయాధికారులకు సహాయకారిగా మాత్రమే ఉండేవారు తప్ప, రైతులతో మమేకమయ్యేవారు కాదు. ఎక్కడో పట్టణ ప్రాంతంలో నివసిస్తూ వేళకు విధులకు హాజరై వెళ్లిపోయేవారు. ఆదర్శ రైతులను తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వం మరల ఈ ఎంపీఈవోల వ్యవ స్థను తీసుకురావాలని భావిస్తోంది. ఆదర్శ రైతులు 250 కుటుంబాలకు ఒకరు చొప్పున ఉండటంతో రైతులకు అందుబాటులో ఉండేవారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో రైతులకు చేరేవి. పంట నష్టం అంచనాల నమోదులోనూ అధికారులతో కలసి క్షేత్రస్థాయికి వెళ్లి సహకారం అందించేవారు. ఆదర్శ రైతుల స్థానంలో మళ్లీ ఎంపీఈవోల వ్యవస్థను తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ కొనసాగింది. మండలానికి నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే ఉండటం వల్ల వీరు రైతులకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు.