‘ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే’
కవాడిగూడ: ఆదర్శ రైతు వ్యవస్థను రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలని, లే కపోతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతమవుతాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డిలు హెచ్చరించారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆదర్శ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో గురువారం మహా ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు హాజరయ్యారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడం రైతు లోకానికే అవమానకరమన్నారు. ఆదర్శ రైతులకు, రైతు సంక్షేమానికి నిధుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం పోలీసు వాహనాలకు రూ.340 కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదని తన క్యాంపు కార్యాలయానికి రూ.26 కోట్లు ఎలా మంజూరు చేయించుకున్నారని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. సోనియాను దేవత అని పొగిడి సన్మానం చేస్తానన్న కేసీఆర్ నేడు సానియాకు సన్మానం చేస్తున్నారని దుయ్య బట్టారు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎంతో మందిని రోడ్డున పడేయడానికి పూనుకున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీల ముద్రవేసి ఆదర్శ రైతులను తొలగించడం సరైంది కాదన్నారు.
30న కలెక్టర్ కార్యాలయాల ముట్టడి
ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆ సంఘాల కమిటీలు ఈ నెల 30నఅన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతు సంఘాల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ఎన్.శేఖర్, ఏపీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, నాయకులు సామినేని రాము, వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.