మీ స్కైప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయా?
కొత్త కొత్త మాల్వేర్లను (మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్) ఉపయోగించి ఖాతాల్లో డబ్బు తస్కరించే హ్యాకర్లనే ఇప్పుటి దాకా చూస్తున్నాం. ఇప్పుడు వారి దృష్టి ఆన్లైన్ సంభాషణలపై పడింది. ఆన్లైన్ లోనే అన్ని రకాల సంభాషణలు జరుపుతున్న నేటి తరుణంలో రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు సిద్ధమౌతున్నారు. తాజాగా స్కైప్ లో జరిగే సంభాషణలను రికార్డు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెరికా వంటి దేశాల్లో కొత్త మాల్వేర్ ను ఉపయోగించి సైబర్ దాడులకు పాల్పడినట్లు వివరిస్తున్నారు.
ఏ దేశంలో నివసిస్తున్న వారితోనైనా మన ముందున్నట్లే మాట్లాడేందుకు స్కైప్‌ను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు అదీ ఇదీ అని లేకుండా ప్రతి విషయాన్నీ స్కైప్ కాల్స్‌లో షేర్ చేసేసుకుంటున్నాం. ఆఫీస్ మీటింగ్‌లు, రహస్య సంభాషణలు అన్నీ స్కై ప్ లో జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన స్కైప్‌లో మాట్లాడేప్పుడు ఏవైనా రహస్య సంభాషణలు ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు సైబర్ నిపుణులు. స్కైప్ లో జరిగే రహస్య సమాచారాన్ని T9000 మాల్వేర్ను ఉపయోగించి తస్కరించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీడియో సంభాషణలను రికార్డు చేసేందుకు, స్క్రీన్ షాట్లు తీసేందుకు ఈ శక్తివంతమైన T9000 మాల్వేర్ ను వినియోగిస్తున్నట్లు సైబర్ రక్షణాధికారులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ఇప్పుడు ఎటువంటి యాంటీ వైరస్ కు దొరక్కుండా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు.
మైక్రోసాఫ్ట్ కు చెందిన వీడియో ఛాటింగ్ ప్రోగ్రామ్ స్కైప్ ను ప్రతిరోజూ సుమారు 4.9 మిలియన్ల మంది వాడుతున్నట్లు గతేడాది జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లకు పోటీగా స్కైప్ ను వినియోగదారులు వాడటం కనిపెట్టిన హ్యాకర్లు... ఇప్పుడు రహస్య వీడియో సంభాషణల తస్కరణపై దృష్టి పెట్టారు. కొత్తగా వచ్చిన ఈ T9000 మాల్వేర్ మార్కెట్లోని ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లను తప్పుదోవ పట్టించగలదని పాలో ఆల్టో నెట్ వర్కింగ్ సంస్థ చెప్తోంది.
ఈ వైరస్.. సిస్టమ్ లో పనిచేసే సుమారు 24 రకాల సెక్యూరిటీ విభాగాలను దాటి వ్యాపించగలదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. మనం వాడే కంప్యూటర్, లేదా మొబైల్ యాండ్రాయిడ్ పరికరాల్లోని వేటిలోనైనా ప్రవేశించి అందులోని సమాచారాన్ని చోరీ చేయగల శక్తి ఈ వైరస్ కు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ను ఇప్పటికే అమెరికాలోని పలు సైబర్ దాడుల్లో వినియోగించినట్లు సంస్థ తెలుపుతోంది. స్కైప్ వినియోగించేందుకు explorer.exe పేరుతో వచ్చే ఫైల్స్ ను నమ్మొద్దని సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని వీడియో ఫైల్స్ ను తస్కరించేందుకు హ్యాకర్లు వాడుతున్నట్లు పాలో ఆల్టో నెట్వర్కింగ్ సంస్థ చెబుతోంది.