TAGO
-
ప్రవాస పద్యకవి తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి
తెలుగు భాషా సౌందర్యం అవగతమయ్యేది ఛందస్సుకి అనుగుణంగా యతిప్రాసలతో విరాజిల్లే పద్య సంపదతోటి. చక్కని పదాలను కూర్చి, గణాలకు సరిపడాపేర్చి, యతి ప్రాసలతో తీర్చిపద్యం వ్రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఆంగ్లమాధ్యమంలోనే చిన్నతనం నుంచి విద్యను అభ్యసించి, తెలుగు పాఠ్యాంశమేలేని ఇంజనీరింగ్ విద్యలో పట్టభద్రుడై, పొద్దున్నలేస్తే ఆంగ్లంతోనే కుస్తీపడే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న కూడా తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి పద్యాలు అల్లడంలో దిట్ట. అమెరికాలో ఫ్లోరిడాలోని ఓర్లాండోలో నివసిస్తున్నతటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి మనస్సుకు హత్తుకునేలా సద్యఃస్ఫురణతో పద్యాలు వ్రాసే విద్యకూడా ఎంతోచక్కగా అబ్బింది. ఓర్లాండో తెలుగు వారు ఈ యువ కవిని ఆత్మీయంగా అక్కున చేర్చుకుని ప్రోత్సహించటం బంగారానికి మెరుగుఅద్దినట్టయ్యింది. అందుకు ఉదాహరణే 'సరదశ(త)కం' అనే పద్యద్విశతి. కేవలం మూడే నెలల్లో, పెన్ను పేపరు మీద పెట్టకుండా అప్పటికప్పుడు వాట్స్ఆప్ చర్చల్లో ప్రతిస్పందిస్తూ వ్రాసిన పద్యాలే 200 పైచిలుకురావటం గమనార్హం. అవన్నీ ఓర్లాండో మహానగర తెలుగుసంఘం అచ్చు కూడా వేయించింది. తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి వృత్తిరీత్యా ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా మధురమైనపద్యాలు అల్లే పద్యకవి. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే 'చక్రి పలుకు' అని ఆట వెలది శతకం వ్రాశారు. ఇప్పటి వరకు వెయ్యి పైచిలుకు పద్యాలు వ్రాసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్. టాగో ఉగాది వేడుకల సందర్భంగా 'సరదాగా ఒక సాయంత్రం' అనే సాహిత్య ప్రధాన కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆసాహితీచర్చలే 'సరదా శ(త)కం' అనే పద్యద్విశతికి స్ఫూర్తి. సామాజిక, రాజకీయసమకాలీన అంశాలతోపాటూ, భక్తి వైరాగ్యభావాలు, భార్యాభర్తల సరదాకబుర్లు, దేశభక్తి ప్రధానపద్యాలు, సమస్యాపూరణలు, దత్త పదులు, పదికన్నా ఎక్కువ పాదాలు ఉండే మాలికలు, శాక పాకాల మీద దండకాలు ఇలా ఎన్నోఎన్నో విషయాల మీదా బ్రహ్మాండమైన పద్యాలు ఆపుస్తకంలో ఉన్నాయి. టాగో పూర్వాధ్యక్షులు, తెలుగు భాషాభిమానులు అయిన శాయి ప్రభాకర్ యెర్రాప్రగడ, మధుచెరుకూరి, సాంబశివ మంగళంపల్లిలు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అపర్ణ ధూళిపాళ, రాం ప్రసాద్ నిట్టా, శ్రవణ్ లిజల, నరోత్తంలు ఈ 'సరదాశ(త)కం' పుస్తకావిష్కరణ చేశారు. ఆరెంజ్ కౌంటీ ప్రాపర్టీ అప్రైసర్ రిక్సింగ్, శ్రీకళ్యాణ చక్రవర్తిని శాలువతో సత్కరించారు. టాగో ప్రస్తుత అధ్యక్షులు రమేష్ ఐలా అధ్యక్షతన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. -
ఒర్లాండోలో 'భువన విజయం'
అలరించిన భువన విజయం ఒర్లాండో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఒర్లాండో(టాగో) ఆధ్వర్యంలో సెంట్రల్ ఫ్లోరిడా ఆడిటోరియంలో జరిగిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. కౌంటీ ప్రాపర్టీ అప్రైజర్ రిక్ సింగ్ ఆరెంజ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'భువన విజయం' నాటిక అందరిని అలరించింది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలతో జరిపిన సంభాషణలను నాటికలో అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయల పరాక్రమపాటవాన్ని, కవితాభినివేశాన్ని, దానగుణాలను కవులు పద్యరూపంలో ప్రస్తుతించారు. తెలుగు భాషా గొప్పదనాన్ని నాటికలో వివరించారు. రాయల కాలం నుంచి ఆధునిక యుగం వరకు జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలతో కొత్తదనంగా ఈ నాటికను రూపొందించారు. కిభాశ్రీ, సాయి ప్రభాకర్, కళ్యాణ్, మూర్తి బొందాడ, మధు చెరకూరిలు నాటికని విజయ వంతంగా ప్రదర్శించడంలో తమ వంతు కృషి చేశారు. టాగో ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. -
జీవీ రామారావుకు టాగో ఘన సన్మానం
ఒర్లాండో: అమెరికాలోని చిన్నారులపై మొదటిసారిగా 'కెప్టెన్ రిడ్డిల్స్ ట్రెజర్' పుస్తకం రాసిన కెప్టెన్ జీవీ రామారావును సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఒర్లాండో(టాగో) ఘనంగా సన్మానించింది. జీవీ రామారావు భారత నావికాదళంలో పని చేసి రిటైర్ అయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టా పుచ్చుకున్నారు. షిప్ కెప్టెన్‌గా ప్రపంచం మొత్తాన్ని ఆయన చుట్టారు. చిన్న చిన్న కథలతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ది కోలోనియల్స్స్ లాస్ట్ వికెట్, ది గుడ్ బాయ్, ఆల్ అట్ సీ, ది ఇన్‌కంప్లీట్ మ్యాన్, ది ఆడ్ వేస్ ఆఫ్ గాడ్స్, ఎమ్మాస్ ఎస్కపడేస్ ఇంక్రీడబుల్ ఇండియాలాంటి పలు ప్రముఖ పుస్తకాలను ఆయన రాశారు. టాగో నిర్వహించిన ఈ సమావేశంలో భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తన గాత్రంతో గజల్ శ్రీనివాస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా 2017 ఏడాదికిగానూ నూతన కార్యవర్గ సభ్యులను టాగో ప్రెసిడెంట్ రమేష్ ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యులు... అపర్ణ దూలిపాల (ఎలక్టెడ్ ప్రెసిడెంట్) శివ కొండపల్లి(సెక్రటరీ)ఔ సత్య మాంటేనా(ట్రెజరర్) పద్మ లింగం( కల్చరల్ సెక్రటరీ) క్రిష్ణ మునుగోటి(నార్త్ ఎగ్జిక్యూటివ్ మెంబర్) రాజ్‌పాల్ మార్పు(ఈస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ) జ్యోష్ణ పుడోత(వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్) నాగ్ మోత్కురి(సౌత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ) రోహిత్ కాశిరెడ్డి(యూత్ అధ్యక్షుడు) అంజలి చెరకు(యూత్ అధ్యక్షురాలు)