ఇన్చార్జీ డీఈఓగా తాహెరా సుల్తానా
కర్నూలు సిటీ: డీఈఓగా ఇన్చార్జ్ బాధ్యతలను తాత్కాలికంగా డిప్యూటీ ఈఓ తహేరా సుల్తానాకు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి అనూహ్య పరిణామాల మధ్య 2015లో డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు చేపట్టి ఉపాధ్యాయ వర్గాల్లో రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా ఏడాదికిపైగా పని చేసిన డీఈఓగా కూడా గుర్తింపు పొందినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మరో 40 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరుగనున్న సమయంలో డీఈఓకు జేడీగా పదోన్నతి వరించింది. దీంతో ఆయన ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్, డీఈఓ పూర్తి అదనపు బాధ్యతల నుంచి రీలివ్ అయ్యారు. ఈ క్రమంలో రెగ్యులర్ డీఈఓ వచ్చేంత వరకు ఈ రెండు స్థానాల ఇన్చార్జ్ బాధ్యతలను డిప్యూటీ ఈఓగా తాహెరా సుల్తానా తీసుకున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
పదోన్నతి వరిస్తే..
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో కేవలం 2 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈఓలున్నారు. మిగిలిన 11 జిల్లాలకు ఇన్‌చార్జీలే పని చేస్తున్న క్రమంలో డిప్యూటీ ఈఓలకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే మహిళా కోటాలో సీనియార్టీ పరంగా తహేరా సుల్తానాకు ముందు వరుసలో డీఈఓ పదవి వరించే అవకాశం ఉంది. అయితే డీఈఓగా కొత్త అధికారిని తెచ్చుకునే ప్రయత్నంలో కలెక్టర్ ఉన్నట్లు తెలిసింది. లేనిపక్షంలో జేడీ హోదాలో డీఈఓగా విద్యా సంవత్సరం చివరి వరకు రవీంద్రనాథ్‌రెడ్డిని పని చేయించుకునేందుకు ప్రభుత్వ నుంచి అనుమతి తెచ్చుకుంటానని చెబుతున్నట్లు సమాచారం.