Take Wood
-
భారీగా కలప స్వాధీనం
రంపచోడవరం: అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో టీడీపీ నాయకుడి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఫారెస్ట్ స్క్వాడ్ అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. ఫారెస్టు స్క్వాడ్ డీఆర్ఓ సోమరాజు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. అక్రమంగా టేకు కలప నిల్వ చేసిన టీడీపీ నాయకుడు బూర్లు హరిబాబుపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న కలపను కోనలోవ సెక్షన్ అధికారికి అప్పగించారు. దీనిపై స్క్వాడ్ అధికారులు టేకు అక్రమ నిల్వపై హరిబాబును ప్రశ్నించారు. సమీపంలో కొట్టపాలెం గ్రామంలోని గిరిజనుడు పొలం నరికి వేసిన చెట్లను తాను తీసుకువచ్చి గృహోపకరణాలు చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఇదీ చట్టరీత్యా నేరమని స్క్వాడ్ అధికారి సోమరాజు తెలిపారు. అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఏజెన్సీలో సొంత పొలంలో ఉన్న విలువైన టేకు, వేప తదితర జాతుల చెట్లును నరకాలంటే ముందుగా అటవీశాఖ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. అయితే హరిబాబు పొలంలో స్వాధీనం చేసుకున్న కలపకు ఎటువంటి అనుమతులు లేవు. దీంతో ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇదే పొలంలో అటవీశాఖ ఎన్ఆర్జీఎస్ అనుసంధానంతో నర్సరీ నిర్వహిస్తోంది. ప్రతిరోజూ అటవీ అధికారులు ఈ నర్సరీని సందర్శించి మొక్కల పరిస్థితి, కూలీల గురించి పర్యవేక్షణ చేస్తారు. అయితే నర్సరీ పరిసరాల్లోనే భారీ టేకు కలపను నిల్వ చేసి సైజులుగా కోసినా స్థానిక అటవీ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కోనలోవ అటవీ సెక్షన్ పరిధిలో టేకు ప్లాంటేషన్ల్లో టేకు చెట్లను స్మగర్లు నరికి వేసినట్టు సమాచారం. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు చెబుతున్నారు. అలాగే నర్సరీలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణాలు ఉన్నాయి. ఎక్కడో విజయవాడలో చదువుతున్న ఇద్దరు యువకుల పేరున ఎన్ఆర్ఈజీఎస్ మస్తర్లు నమోదు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు. నర్సరీ వ్యవహరంపై విచారణ జరిపితే నిజాలు తేటతెల్లమవుతాయంటున్నారు. -
రూ.2 లక్షల విలువైన టేకు దుంగలు స్వాధీనం
ఖానాపూర్ (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పెంబి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన టేకు దుంగలను బుధవారం అర్థరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎద్దులబండ్ల ద్వారా కలప తరలిపోతోందని సమాచారం అందుకున్న పెంబి అటవీ శాఖ అధికారులు.. పెంబి, ఖానాపూర్ పోలీసుల సాయంతో స్మగ్లర్లను నిలువరించారు. స్మగ్లర్లు పరారయ్యారు. కాగా బండ్లపై ఉన్న 35 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని, వాటిని పెంబి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ దుంగలు సుమారు రూ. 2 లక్షలు విలువ చేస్తాయని అటవీ అధికారులు తెలిపారు. -
జడ్పీ సీఈవోను వెంటాడుతున్న అవినీతి
సాక్షి, సంగారెడ్డి: జడ్పీ సీఈఓ బి. ఆశీర్వాదంను ‘టేక్ వుడ్’ వెంటాడుతోంది. బాపట్లలోని ‘ఎక్స్‌టెన్షియన్ ట్రైనింగ్ సెంటర్’ ప్రిన్సిపాల్‌గా ఆయన 2009-12 మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో కళాశాల క్వార్టర్లకు సంబంధించిన టేక్ వుడ్ తలుపులు, కిటికీలతోపాటు విలువైన ఆస్తులు మాయమయ్యాయి. తదనంతరం బాధ్యతలు స్వీకరించిన కళాశాల ప్రిన్సిపాల్ ఈ అంశాన్ని తన నివేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాజేందర్ నగర్(హైదరాబాద్)లోని ఎక్స్‌టెన్షియన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్స్‌పాల్ రంగా ద్వారా ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపించగా టేక్‌వుడ్, ఇతర ఆస్తులు దుర్వినియోగమైనట్లు రుజువైంది. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి 2012 జూన్ 25న నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం ఏఎంఆర్-అపార్డ్ సంస్థ అధినేత ప్రసాద్‌తో దర్యాప్తు జరిపించగా ఆయన అదే ఏడాది డిసెంబర్ 5న ప్రభుత్వానికి సమగ్ర దర్యాప్తు నివేదిక సమర్పించారు. నివేదికల ఆధారంగా ఆశీర్వాదంపై ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలను మోపుతూ గురువారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి వి. నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నాకేం సంబంధం లేదు బాపట్లలోని క్వార్టర్లకు సంబంధించిన టేక్‌వుడ్ తలుపులు, కిటికీలు మాయమైన విషయంలో నన్ను అకారణంగా ఇరికించారు. నేను బాధ్యతలు స్వీకరించే నాటికే అక్కడ కిటికీలు, తలుపులు లేవు. ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నా హోదాకు సమాన హోదా, తక్కువ హోదా కలిగిన అధికారులతో విచారణ జరిపించడం ఎంతవరకు సబబు? నాకు ఎలాంటి నోటీసులూ పంపలేదు. - జడ్పీ సీఈఓ బి. ఆశీర్వాదం