దీప రాజకీయ అరంగేట్రం
రాష్ట్ర రాజకీయాలు మంగళవారం మరోసారి జాతీయతెరపై మెరవనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న కుమార్తె దీప రాజకీయ అరంగేట్రమే ఇందుకు కారణం. తన రాజకీయ ప్రవేశం సందర్భంగా దీప చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ పార్టీలో కల్లోల వాతావరణాన్ని సృష్టించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను సహించలేక రగిలి పోతున్నవారంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయకత్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. శశికళ బొమ్మలను చింపివేయడం ద్వారా తమ నిరసనను చాటుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధికశాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతున్నాయి. ప్రతిరోజు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు.
కొందరు ఉత్సాహవంతులు సేలం జిల్లాలో దీప పేరవైని స్థాపించడమేగాక రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో మరో అభిమాన వర్గం ‘జయలలిత, ఎంజీఆర్ అన్నాడీఎంకే’ అనే పార్టీ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ‘అఖిల భారత అమ్మ ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఏఐఏడీఎంకే) అనే పార్టీ ఇటీవల నామక్కల్‌లో నెలకొల్పడమేగాక పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. దీపకు మద్దతుగానే తమ పార్టీని స్థాపించినట్లు వ్యవస్థాపకులు తెలిపారు. జయలలిత రాజకీయ సలహాదారు దురై బెంజిమిన్ ‘అమ్మ మక్కల్ మున్రేట్ర సంఘం’ను సోమవారం స్థాపించి రిజిష్ట్రషన్ కూడా చేయించారు.
శశికళ మద్దతుదారుల బెదిరింపులు
ఈ నెల 17వ తేదీన దీప రాజకీయ ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు చెన్నై విరుగంబాక్కంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి శశికళ మద్దతుదారులు అడ్డంకులు సృష్టించారు. దీప పేరవై తరఫున విరుగంబాక్కంలో ఒక కల్యాణ మండపాన్ని ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే సమావేశ నిర్వాహకులు వచ్చే వేళకు కల్యాణ మండపానికి తాళం వేసి ఉంది. అంతేగాక దీప పేరవై సమావేశం నిర్వహించేందుకు వీలులేదని పోలీసులు తరిమివేయడంతో స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశం కోసం ఈ నెల 13వ తేదీన కల్యాణ మండపాన్ని బుక్ చేసి అడ్వాన్సు కూడా చెల్లించామని దక్షిణ చెన్నై జిల్లా అమ్మా పేరవై సహాయ కార్యదర్శి కె.పుగళేంది తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లో అనుమతికి దరఖాస్తు చేసుకోగా చర్చా సమావేశాలకు అనుమతి అవసరం లేదని చెప్పారని ఆయన అన్నారు. అయితే అకస్మాత్తుగా శశికళ మద్దతుదారులు రంగప్రవేశం చేసి కల్యాణ మండపం యాజమాన్యాన్ని బెదిరించి తాళాలు వేయించారని ఆయన ఆరోపించారు.
నేడు దీప ప్రకటన
అధికార అన్నాడీఎంకే నుంచి ఎదురవుతున్న ఇటువంటి ప్రతిఘటన వాతావరణంలో దీప తన రాజకీయ భవిష్యత్తుకు మంగళవారం పునాదులు వేయడం ప్రారంభిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన దీప తన పేరుతో వెలసిన పేరవైలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా, అలాగాక మరేదైనా ప్రముఖ పార్టీలో చేరుతారా అనే ఆలోచనలతో ఉత్కంఠ నెలకొని ఉంది. తన కోసం ఇంటికి వచ్చే అభిమానులకు రెండాకుల చిహ్నం వలె రెండు వేళ్లను చూపుతుండగా ప్రజలు కేరింతలు కొడుతున్నారు. తన అభిమానులు ఆశిస్తున్న బాటనే ఎంచుకుంటానని సోమవారం సైతం తన ఇంటి వద్ద దీప స్పష్టం చేశారు. అలాగని అన్నాడీఎంకేలో చేరే అవకాశం లేదు. ఇంతకూ దీప రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని అన్ని పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది.