tamsi
-
అర్లి(టి)లో చలి.. పొద్దెక్కని పల్లె
ఈ పల్లె కోడి కూయకముందే నిద్రలేస్తది.. రెండువారాలుగా ఉదయం 7 దాటినా.. ముసుగుతన్ని పడుకునే ఉంటోంది.. అర్లి(టి).. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతం.. ఎప్పుడు చూసినా.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల లోపే.. మనమేమో 12 డిగ్రీలు ఉన్నా.. గజగజవణుకుతున్నాం.. ఈ నేపథ్యంలో అసలు అక్కడి జనమేం చేస్తున్నారు.. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఉన్న అర్లి(టి) గ్రామంలో ‘సాక్షి’ బృందం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ‘ఫీల్డ్ విజిట్’ చేసింది. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు పెన్‌గంగా పరీవాహక ప్రాంతం.. పైగా దగ్గరలో అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అర్లి(టి)లో చలి బాగా ఉంది.. దారంతా చలిమంటలు.. అందరూ శాలువాలు, దుప్పట్లు, చద్దర్లు కప్పుకొనే కనిపించారు. మనుషులే కాదు.. పశువులు కూడా.. ఉదయం 7 గంటలు దాటాకే.. నెమ్మదిగా ఇళ్లల్లో నుంచి జనం బయటకు రావడం ప్రారంభించారు.. మామూలుగా తెలవారకముందే ఇంటి పనులు మొదలుపెట్టే మహిళలు, రైతన్నలు అప్పుడే పనులకు ఉపక్రమిస్తూ కనిపించారు. ఎలా ఉంది ఇక్కడ అని బిల్లావార్ లక్ష్మిని పలకరించాం.. ‘‘చలి బాగా ఉంది.. పనులు చేసుకోలేకపోతున్నాం.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.. ఇంటి ముందు చలిమంట వేసుకుంటున్నాం.. ఉదయం లేచి పనులు చేయాలంటే.. చేతులు, కాళ్లు తిమ్మిరిపట్టినట్లు అవుతున్నాయి’’ అని చెప్పింది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. చలిగాలులు లోపలికి రాకుండా కిటికీలు, తలుపులను టార్పాలిన్ కవర్ల ద్వారా మూసివేయించారు. పశువులకు గోనెసంచులు, దుప్పట్లు కప్పి ఉంచారు.. రైతులు, కూలీలు అయితే సాయంత్రం 4 అయ్యేసరికే ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలోనే ఇంత చలిని ఎప్పుడూ చూడలేదని 90 ఏళ్ల వృద్ధురాలు సంద భూమక్క చెప్పింది. ‘10 రోజులుగా చలి విపరీతంగా పెడుతోంది. ఇంటి నుంచి బయటకు పోతలేను. రోజంతా దుప్పటి కప్పుకొనే ఉంటున్న’ అని తెలిపింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడం వల్ల కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. – తాంసి (ఆదిలాబాద్ జిల్లా), ఫొటోలు: చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
రచ్చబండ.. రసాభాస
తాంసి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. సభ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ మండల కన్వీనర్ నారాయణ, మాజీ కన్వీనర్ రామన్న యాదవ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రజినీకాంత్, నాయకులు సంతోష్, గంగయ్య, దేవారెడ్డి, భోజన్న వేదికపైకి చేరుకున్నారు. రచ్చబండ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో స్థానంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫొటో అతికించేందుకు యత్నించారు. అదే సమయంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్, వినోద్ వేదికపైకి వచ్చి ఫ్లెక్సీ పూర్తిగా తొలగించేందుకు యత్నించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, అధికారులు స్పందించి ఆయూ పార్టీల నాయకులను వేదిక పైనుంచి పంపించి వేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రచ్చబండ ఫ్లెక్సీపై సీఎం ఫొటో స్థానంలో ఉపముఖ్యమంత్రి ఫొటో అతికించారు. కరంజి(టి) రోడ్డు బాధితులు.. సభ కొనసాగుతుండగా.. కరంజి(టి), గోముత్రి, అంతర్గాం, అర్లి(టి), వడూర్, ధనోర, గోనా, అందర్‌బంద్, బెల్సరిరాంపూర్, భీంపూర్, నిపాని, పిప్పల్‌కోటి, తాంసి(కే) పంచాయతీలకు చెందిన నాయకులు, ప్రజలు వేదిక వద్దకు వచ్చారు. కరంజి(టి) రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని, బస్సులు రద్దు చేసి పన్నెండు రోజులవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనను నాయకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతుకు హామీ ఇచ్చే వరకూ సభను జరగనివ్వబోమని నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఎమ్మెల్యే గోడం నగేశ్ స్పందిస్తూ తాను ఇదివరకే వివిధ పథకాల కింద రోడ్డు మరమ్మతుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించానని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గురువారంలోగా మరమ్మతు పనులు ప్రారంభింపజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం సభ సాఫీగా సాగింది. మండల ప్రత్యేకాధికారి, జేడీఏ రోజ్‌లీల, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.