అర్లి(టి)లో పంట పొలాల్లో కమ్ముకున్న పొగమంచు
ఈ పల్లె కోడి కూయకముందే నిద్రలేస్తది.. రెండువారాలుగా ఉదయం 7 దాటినా.. ముసుగుతన్ని పడుకునే ఉంటోంది.. అర్లి(టి).. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతం.. ఎప్పుడు చూసినా.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల లోపే.. మనమేమో 12 డిగ్రీలు ఉన్నా.. గజగజవణుకుతున్నాం.. ఈ నేపథ్యంలో అసలు అక్కడి జనమేం చేస్తున్నారు.. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఉన్న అర్లి(టి) గ్రామంలో ‘సాక్షి’ బృందం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ‘ఫీల్డ్ విజిట్’ చేసింది.
రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు
పెన్‌గంగా పరీవాహక ప్రాంతం.. పైగా దగ్గరలో అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అర్లి(టి)లో చలి బాగా ఉంది.. దారంతా చలిమంటలు.. అందరూ శాలువాలు, దుప్పట్లు, చద్దర్లు కప్పుకొనే కనిపించారు. మనుషులే కాదు.. పశువులు కూడా.. ఉదయం 7 గంటలు దాటాకే.. నెమ్మదిగా ఇళ్లల్లో నుంచి జనం బయటకు రావడం ప్రారంభించారు.. మామూలుగా తెలవారకముందే ఇంటి పనులు మొదలుపెట్టే మహిళలు, రైతన్నలు అప్పుడే పనులకు ఉపక్రమిస్తూ కనిపించారు. ఎలా ఉంది ఇక్కడ అని బిల్లావార్ లక్ష్మిని పలకరించాం.. ‘‘చలి బాగా ఉంది.. పనులు చేసుకోలేకపోతున్నాం.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.. ఇంటి ముందు చలిమంట వేసుకుంటున్నాం.. ఉదయం లేచి పనులు చేయాలంటే.. చేతులు, కాళ్లు తిమ్మిరిపట్టినట్లు అవుతున్నాయి’’ అని చెప్పింది.
ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. చలిగాలులు లోపలికి రాకుండా కిటికీలు, తలుపులను టార్పాలిన్ కవర్ల ద్వారా మూసివేయించారు. పశువులకు గోనెసంచులు, దుప్పట్లు కప్పి ఉంచారు.. రైతులు, కూలీలు అయితే సాయంత్రం 4 అయ్యేసరికే ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలోనే ఇంత చలిని ఎప్పుడూ చూడలేదని 90 ఏళ్ల వృద్ధురాలు సంద భూమక్క చెప్పింది. ‘10 రోజులుగా చలి విపరీతంగా పెడుతోంది. ఇంటి నుంచి బయటకు పోతలేను. రోజంతా దుప్పటి కప్పుకొనే ఉంటున్న’ అని తెలిపింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడం వల్ల కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. – తాంసి (ఆదిలాబాద్ జిల్లా), ఫొటోలు: చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment