తాంసి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. సభ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ మండల కన్వీనర్ నారాయణ, మాజీ కన్వీనర్ రామన్న యాదవ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రజినీకాంత్, నాయకులు సంతోష్, గంగయ్య, దేవారెడ్డి, భోజన్న వేదికపైకి చేరుకున్నారు.
రచ్చబండ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో స్థానంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫొటో అతికించేందుకు యత్నించారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ నాగారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్, వినోద్ వేదికపైకి వచ్చి ఫ్లెక్సీ పూర్తిగా తొలగించేందుకు యత్నించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, అధికారులు స్పందించి ఆయూ పార్టీల నాయకులను వేదిక పైనుంచి పంపించి వేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రచ్చబండ ఫ్లెక్సీపై సీఎం ఫొటో స్థానంలో ఉపముఖ్యమంత్రి ఫొటో అతికించారు.
కరంజి(టి) రోడ్డు బాధితులు..
సభ కొనసాగుతుండగా.. కరంజి(టి), గోముత్రి, అంతర్గాం, అర్లి(టి), వడూర్, ధనోర, గోనా, అందర్‌బంద్, బెల్సరిరాంపూర్, భీంపూర్, నిపాని, పిప్పల్‌కోటి, తాంసి(కే) పంచాయతీలకు చెందిన నాయకులు, ప్రజలు వేదిక వద్దకు వచ్చారు. కరంజి(టి) రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని, బస్సులు రద్దు చేసి పన్నెండు రోజులవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ఆందోళనను నాయకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతుకు హామీ ఇచ్చే వరకూ సభను జరగనివ్వబోమని నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఎమ్మెల్యే గోడం నగేశ్ స్పందిస్తూ తాను ఇదివరకే వివిధ పథకాల కింద రోడ్డు మరమ్మతుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించానని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గురువారంలోగా మరమ్మతు పనులు ప్రారంభింపజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం సభ సాఫీగా సాగింది. మండల ప్రత్యేకాధికారి, జేడీఏ రోజ్‌లీల, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.