'భాషను నిరంతరం సాధన చేయండి'
- తానా సాహిత్య సభలో జస్టిస్ రమణ
తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాల వారికి అందించాలంటే దాన్ని తప్పనిసరిగా పిల్లల చేత సాధన చేయించాలని అంతే గానీ 10ఏళ్లు వరకు నేర్పించి తర్వాత వదిలేస్తే భాషకు అన్యాయం చేసినట్లేనని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు. ఈ బాధ్యతలో ప్రవాసుల పాత్ర కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి రమణ తానా సాహిత్య సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు 10ఏళ్ల దాకా తెలుగు నేర్పించి వదిలేస్తున్నారని, అది మంచి పధ్ధతి కాదని, వారితో తెలుగులో ప్రతి రోజు మాట్లాడటం ద్వారా వారిలో ఆ భాషపై పట్టు, మమకారం పెంచడమే గాకుండా భాషను కూడా బతికించుకోవచ్చునని అన్నారు.
నిర్మల రచించిన “ద గేమ్ ఆఫ్ లవ్” అనే పుస్తకాన్ని రమణ ఆవిష్కరించి తొలిప్రతిని యార్లగడ్డకు అందించారు. ఈ కార్యక్రమంలో వెలమల సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ముగింపు రోజు వేడుకల్లో కూడా రమణ పాల్గొన్నారు. సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులను ఆయన కలుసుకుని అభినందించారు. సుద్దాల అశోక్ తేజ ఆలపించిన "నేలమ్మ నేలమ్మా" పాటకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.