తణుకులో వణుకు
ఎన్నికలంటేనే భయపడుతున్న కాంగీయులు
రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ
మారే యత్నాలు
సీటిస్తామన్నా వేచి చూద్దామనే
ధోరణిలో టీడీపీ ఆశావహులు
కాంగ్రెస్, టీడీపీలకు అంతుచిక్కని
వైసీపీ వ్యూహం
త ణుకు, న్యూస్లైన్ :
ఎన్నికల పేరు చెబితే కాంగ్రెస్ నేతలు హడలెత్తిపోతున్నారు. పిలవని పేరంటంలా ముంచుకొచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో మొహం చాటేస్తేనే మంచిదనే ఆలోచనకు వచ్చారు. మరోవైపు పిలిచి సీటిస్తామన్నా మునిసిపల్ పదవులకు పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు రాకుండా వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అవలంభిస్తున్న వ్యూహాలు కాంగ్రెస్, టీడీపీలకు కలవరం పుట్టిస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలు అవకాశాల కోసం వైసీపీతో మంతనాలు సాగిస్తుండటంతో వైసీపీ ఎలాంటి ఎత్తులు వేయనుందనే విషయం కాంగ్రెస్, టీడీపీలకు అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక ఆయనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనే విషయాలపై కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టత కొరవడింది. ఈ పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను సైతం గందరగోళానికి గురి చేస్తున్నారుు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్ కోసం అంతర్గత సమావేశాలు జరుపుతూ జంపింగ్ మంత్రం జపిస్తున్నారుు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ స్వప్రయోజనాల కోసం ద్వంద్వ వైఖరి అవలంభించటంతో ప్రజలు ఆ రెండు పార్టీల తీరుపై విసుగెత్తిపోయారనేది విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం తొలి ఎన్నికలను మునిసిపాలిటీలకు నిర్వహిస్తుండటంతో ఆ రెండు పార్టీల్లోనూ గుబులు రేగుతోంది. రాజకీయ పరిస్థితులపై మెరుగైన అవగాహనతో ఉండే పట్టణ ఓటర్లు విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేసినా రాజకీయంగా తెరమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆ పార్టీల నాయకుల్లో నెలకొంది. దీంతో ఆ పార్టీల్లోని ఆశావహులు ఆచితూచి అడుగువేస్తున్నారు. ఛాన్స్ ఇస్తామంటే ఎగిరి గంతేయూల్సిందిపోరుు వెనుకంజ వేస్తున్నారు.
‘సామాజిక’ సమాలోచనలు
తణుకు మునిసిపల్ చైర్మన్ పదవిని జనరల్కు కేటారుుంచగా, ఇక్కడినుంచి బీసీ వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వటం వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అనే విషయమై టీడీపీ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. బీసీ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసినట్టు తెలిసింది. ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న వర్గానికి చైర్మన్ పదవికి ఎంపిక చే స్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమైనా లబ్ధి కలుగుతుందా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ మునిసిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుకను పోటీకి దింపితే బాగుంటుందని ఒకరిద్దరు సీనియర్ నాయకులు పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావించినట్టు చెబుతున్నారు.
అవకాశం ఇస్తామన్నా...
‘మునిసిపల్ ఎన్నికల్లో మీకు అవకాశం కల్పిస్తున్నాం. పోటీ చేయండ’ని నాయకులు పిలుస్తున్నా కాంగ్రెస్, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి జంకుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో అవకాశమిచ్చి బలి పశువును చేయరు కదా అనే అనుమానాలు ఆ రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. పైగా చైర్మన్ ఎన్నిక పరోక్ష విధానంలో చేపట్టనుండటంతో తణుకులో కనీసం 18 వార్డుల్లో కౌన్సిలర్లు గెలిస్తే గాని ఏదైనా ఒక పార్టీకి చెందిన చైర్మన్ అభ్యర్థి ఆ పదవికి ఎన్నిక కాలేరు. వార్డుల పునర్విభజనతో భౌగోళిక స్వరూపం మారిపోరుుంది. మరోవైపు ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటం, ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో అపజయం పాలైతే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు రాజకీయ పరపతి, భవిష్యత్తు నాశనమవుతాయనే ఆందోళన అందరిలోనూ ఉందని టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.