ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం
ట్రక్కును ఢీకొట్టిన తాండూరు డిపో బస్సు
పింప్రి, న్యూస్‌లైన్ : ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరుతో సహా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం తాండూరు (మంచర్ల) నుంచి ముంబైలోని కుర్లాకి బయల్దేరిన ఏపీ 21జెడ్437 బస్సు సోమవారం ఉదయం నాలుగు గంటలకు పుణేకు చేరుకుంది. అక్కడినుంచి తిరిగి ముంబైకి వెళుతుండగా లోనావాలా సమీపంలోని మాలవలి-దేవలే గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 17 మంది గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం నిగిడిలోని లోకమాన్య తిలక్ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాండూరు ఆర్టీసీ డిపో అధికారులు నిగిడికి వెళ్లారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్లు సి.బాలారెడ్డి (34), తాండూరుకు చెందిన జి.నరేంద్రరెడ్డి (38) ఉన్నారు వీరితోపాటు గాయపడిన వారిలో సునీత ఆంజనేయులు కోతళ్లు (30), నర్సింగ్ కొల్లప్ప (40), కొల్లప్ప తాయప్ప మదార్ (28), అనంతమ్మ కొత్తకొళ్ల (30), చెన్నమ్మ కర్తాల్ (50), చంద్రప్ప ముద్రరాజ్ కర్తల్ (20), వెంకటప్ప కర్తాల్ (40), లక్ష్మి వెంకటప్ప కర్తాల్ (35), అనిత అంజప్ప కడక్కోండ్ర (30), లాలెప్ప కనకప్ప ముద్రరాజ్ (38), అనంతమ్మ కొరక్రోడ (30)లు ఉన్నారు. వీరితోపాటు నవీముంబైలోని పన్వేల్‌కు చెందిన రమేష్ రామచంద్ర వి.సుధ (21), భయందర్‌కు చెందిన అనురాధా చిన్నప్ప పకోల్ (26)లు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పేర్లు తెలియరాలేదు. లోనావాలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.