భారీగా ఇసుక డంపులు సీజ్
తాండూరు: యాలాల మండలంలో భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగ్నానది నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను మండలంలో పరిధిలో పలుచోట్ల అక్రమార్కులు ఇసుక డంపులను నిల్వ చేశారు. మంగళవారం తాండూరు తహసీల్దార్ గోవింద్రావుతోపాటు యాలాల,తాండూరు రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 21 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడగా వాటిని సీజ్ చేశారు. యాలాల మండల పరిధిలోని ప్రతిభా స్కూల్ సమీపంలో ఆరు ట్రాక్టర్ల ఇసుక, లక్ష్మీనారాయణపూర్ నుంచి బషీరాబాద్ మార్గంలో కాటన్ ఇండస్ట్రీస్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మరో 15 ట్రాక్టర్ల ఇసుక డంపులు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.దాంతో ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు.
సీజ్ చేసిన ఇసుక డంపులు మాయంకాకుండా చూడాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ చాంద్‌పాషాను తహసీల్దార్ ఆదేశించారు. పాతతాండూరుతోపాటు యాలాల మండలంలోని కాగ్నా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంతకుముందు తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ తహసీల్దార్ గోవింద్‌రావుతో వాదించారు. చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది కొరత వల్ల రాత్రి తనిఖీలు చేయడం వీలుకావడం లేదని తహసీల్దార్ వైస్ చైర్మన్‌తో స్పష్టం చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఎంఐఎం ఫ్లోర్లీడర్అసిఫ్ పేర్కొన్నారు.