తౌఫీక్ షారుఖ్‌ఖాన్ సైనా నెహ్వాల్ పోలిక
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్పై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, మీడియా అవసరానికి మించి స్పందించడం వల్లే రాద్ధాంతం జరిగిందని భారత స్టార్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. తద్వారా ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించింది. తాను ప్రతీ ఆటగాడిని గౌరవిస్తానని, అందుకే ఈ స్థాయిలో దేశానికి ఆడగలుగుతున్నానని ఆమె చెప్పింది. ‘తౌఫీక్ అంటే నాకు అమిత గౌరవం. ఇండోనేసియాలో అతను షారుఖ్‌ఖాన్ లాంటివాడు. ఇండోనేసియాలో నేనూ ఎన్నో టైటిల్స్ నెగ్గాను. ఇంకా చెప్పాలంటే అక్కడి ప్రజలు నన్ను కూడా ఎంతో అభిమానిస్తారు. తౌఫీక్ గురించి నేను తప్పుగా ఎలా మాట్లాడగలను! ప్రపంచంలో ప్రతీ ఆటగాడిని నేను గౌరవిస్తాను’ అని సైనా స్పష్టం చేసింది. ఐబీఎల్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా, టోర్నీ గురించి, తమ జట్టు ప్రదర్శన గురించి ఆదివారం మీడియాతో ముచ్చటించింది. గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో తౌఫీక్ హిదాయత్, కోచ్ రాజేందర్‌లతో పాటు టీమ్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి పాల్గొన్నారు.
ఇక్కడి డబ్బు ఊరిస్తోంది...
ఐబీఎల్ మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కావడం సంతోషం కలిగిస్తోందని సైనా అభిప్రాయపడింది. తొలి ఏడాదే ఈ స్పందన చూస్తే లీగ్ సక్సెస్ అయినట్లుగా భావిస్తున్నానంది. లీగ్‌లో జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయని, సొంతగడ్డపై తమ జట్టుకు మరో గెలుపు దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఆరంభంలో ఇతర జట్లతో పోలిస్తే మా టీమ్‌లో పెద్దగా వనరులు లేనట్లు అనిపించింది. అయితే మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. మరీ పెద్దగా వ్యూహాలు రచించట్లేదు. నాకూ ప్రతి నగరంలో లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది.
సూపర్ సిరీస్‌లతో పోలిస్తే ఐబీఎల్‌లో ఉన్న డబ్బు అందరినీ ఊరిస్తోందని, అయితే టోర్నీకి ప్రత్యేక విండో కేటాయించడంపై ఇప్పుడే చెప్పలేనంది. షెడ్యూల్‌పై తనకు అసంతృప్తి లేదని, ఆటగాళ్లకు ఒక రోజు విరామం సరిపోతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర అంతర్జాతీయ టోర్నీలతో పోలిస్తే జట్టుగా బరిలోకి దిగడం వల్ల ఆటగాళ్లు మ్యాచుల్లో ఎక్కువగా ఉద్వేగానికి లోనవుతున్నారని, దానినే వారు ప్రదర్శిస్తున్నారని చెప్పిన సైనా, ప్రేక్షకుల అభిమానం చూస్తే తాను వంద రాకెట్లు విసరాల్సి వస్తుందని హాస్యమాడింది.
మళ్లీ వస్తానేమో...
టోర్నీ ఆరంభంలో లీగ్‌పై అలిగిన తౌఫీక్ హిదాయత్ ఇప్పుడు సంతృప్తి చెందినట్లున్నాడు. ‘నేను సంతోషంగా ఉన్నాను. లేదంటే మీ ముందు వచ్చేవాడిని కాదు. ఇలాంటి టీమ్ యాజమాని ఉంటే వచ్చే ఏడాది కూడా లీగ్‌లో పాల్గొంటానేమో’ అని అతను చెప్పాడు. ఇప్పటివరకు ఆటగాడిగానే ఉన్న తాను, కోచ్ తరహాలో హాట్‌షాట్స్ సభ్యులకు సూచనలు ఇవ్వడం కొత్తగా అనిపిస్తోందని హిదాయత్ చెప్పాడు. సైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది షట్లర్లు ఇప్పుడు చైనాను సవాల్ చేసే స్థితిలో ఉన్నారని అతను ప్రశంసించాడు.
ఈ ప్రయాణం అద్భుతం...
ఐబీఎల్‌లో హాట్‌షాట్స్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. గత పది రోజులు నాకు అత్యుత్తమ క్షణాలుగా గడిచాయి. తొలి టోర్నీ కావడం వల్ల జరిగిన లోపాలను వచ్చే ఏడాది సవరించుకుంటాం. మా యువ జట్టు చక్కటి ప్రదర్శన ఇచ్చింది. టోర్నీ ఎవరు నెగ్గినా లీగ్ సక్సెస్ కావడం ముఖ్యమని అన్ని ఫ్రాంచైజీలు భావించాయి. మ్యాచ్ సమయంతో సహా తొలి లీగ్‌లో సహజంగానే కొన్ని అంశాల్లో పొరపాట్లు జరిగాయి. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఐబీఎల్ చూడవచ్చు.
-ప్రసాద్ వి. పొట్లూరి,
హైదరాబాద్ హాట్‌షాట్స్ యజమాని
ఐబీఎల్‌లో నేడు
అవధ్ వారియర్స్ X పుణే పిస్టన్స్
రాత్రి గం. 8.00 నుంచి
ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం