
సైనాపై మాటల ‘జ్వాల’
న్యూఢిల్లీ: సింగిల్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత డబుల్స్‌కు ఇవ్వడం లేదనో... తానూ విజయాలు సాధించినా పట్టించుకోవడం లేదనో గతంలో పరోక్షంగా సైనా నెహ్వాల్‌పై ఎన్నో సార్లు విమర్శలు ఎక్కుపెట్టిన గుత్తా జ్వాల ఇప్పుడు నేరుగా సహచర హైదరాబాదీపై మాటల తూటాలు విసిరింది... అదీ బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్‌పై సైనా చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ! ఐబీఎల్ వేలంలో తనకు లభిస్తున్న మొత్తం పట్ల తౌఫీక్ సంతృప్తి చెందాలని, రిటైరైన ఆటగాడికి అంతకంటే ఎక్కువ మొత్తం ఎలా ఇస్తారని సైనా మంగళవారం వ్యాఖ్యానించింది.
తౌఫీక్ హిదాయత్ గురించి అసలు ఆ తరహాలో ఎవరైనా ఎలా మాట్లాడగలరని జ్వాల వ్యాఖ్యానించింది. తన ట్విట్టర్ అకౌంట్‌లో సైనాపై ఈ ఢిల్లీ స్మాషర్స్ ప్లేయర్ నేరుగా కామెంట్స్ చేసింది. ‘హిదాయత్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. రిటైర్ అయినంత మాత్రాన అతని మాటలను లెక్క చేయరా? అతనికి, అతని స్థాయికి గౌరవం ఇవ్వకుండా ఎవరైనా అసలు ఇలా ఎలా మాట్లాడగలరు. ఇది చాలా బాధాకరం. ఆటలో మీరు ఎంతైనా ఎదగవచ్చు. కానీ సహచర ఆటగాడి అభిప్రాయాలను కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం రిటైర్ అయినంత మాత్రాన అతని గొప్పతనాన్ని ఎవరూ తగ్గించలేరు. ఎప్పటికీ తౌఫీక్ బ్యాడ్మింటన్‌లో గొప్ప ఆటగాడిగా నే నిలిచిపోతాడు. ఇదంతా డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించింది’ అని జ్వాల అభిప్రాయ పడింది. డబ్బులు ఇవ్వకపోవడం సంగతిని పక్కన పెడితే...లారా రిటైర్ అయ్యాడు కాబట్టి ధోని అతడిని అగౌరవపరిచేలా మాట్లాడతాడా అని జ్వాల ప్రశ్నించింది.
వారి అభిప్రాయాలను ఏకీభవించకపోయినా కనీసం అవమానించవద్దని ఆమె చెప్పింది. ‘అతను బ్యాడ్మింటన్ జాతీయ క్రీడగా ఉన్న దేశానికి చెందినవాడు. రిటైర్ అయ్యాడు కాబట్టి తౌఫీక్ ఏమీ మాట్లాడకూడదని సైనా ఉద్దేశమా! నా దృష్టిలో ఇది సరైన పద్ధతి కాదు. అయినా అతనికి డబ్బు అవసరం లేదు. ఆ దేశంలో అతని విలువేమిటో అందరికీ తెలుసు. అక్కడ అతను సచిన్‌లాంటివాడు. ఒక చాంపియన్ ఆటగాడి గురించి సైనా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’ అంటూ జ్వాల తన మాటల దాడిని కొనసాగించింది.