అధిష్టానం ఆగ్రహం
ఆడంబర వివాహాలపై పన్ను నిర్ణయం వెనక్కు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆడంబర వివాహాలపై పన్ను విధిస్తామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురైన న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, దీనిపై ఆచితూచి స్పందించారు. ప్రపంచ పాడి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక పాడి సమాఖ్య నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడంబర వివాహాలపై పన్ను విధించడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఈ నెల 5న జరిగే కాంగ్రెస్ శాసన సభా పక్షం సమావేశంలో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు. శాసన సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం, ముఖ్యమంత్రితో సమాలోచనలు జరుపుతామని తెలిపారు. అనంతరమే దీనిపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆడంబర వివాహాలను నియంత్రించడానికి కొత్త చట్టాలను తీసుకు రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టాలనే బలోపేతం చేస్తామన్నారు. ఆడంబర వివాహాలపై పన్ను విధించాలన్నది కేవలం తమ ఆలోచన మాత్రమేనని చెప్పారు. దీనిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.