అమెరికాలో లెక్కల టీచరును చంపేసిన విద్యార్థి
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అక్కడి డెన్వర్స్ హైస్కూల్లో లెక్కల టీచర్‌ను 14 ఏళ్ల విద్యార్థి చంపేశాడు!! ఫిలిప్ చిస్మ్ అనే ఆ విద్యార్థి తాను చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న కొలీన్ రిట్జర్ (24) అనే లెక్కల టీచర్‌ను చంపినందుకు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
అతడికి బెయిల్ ఇవ్వకుండా అదుపులోనే ఉంచాలని కోర్టు ఆదేశించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. పాఠశాల రెండో అంతస్థులో ఉన్న బాత్రూంలో రక్తపు మరకలు ఉండగా, పాఠశాలకు వెనకాల ఉన్న అటవీప్రాంతంలో రిట్జర్ మృతదేహం పోలీసులకు కనిపించింది. ఆమె మంగళవారం రాత్రి నుంచి కనిపిచండంలేదు. ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, ఇంటికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పాఠశాలలో సాకర్ క్రీడాకారుడైన చిస్మ్ను పోలీసులు అరెస్టుచేశారు.
సీసీ టీవీ కెమెరాలలో పలుచోట్ల అతడి నేరానికి సంబంధించిన సాక్ష్యాలు లభించాయి. అయితే, అసలు టీచర్‌ను ఎందుకు, ఎలా చంపాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అమెరికాలో చిన్న పిల్లలు హత్యలు చేసిన సంఘటనలు ఈ వారంలోనే రెండు జరిగాయి. 12 ఏళ్ల విద్యార్థి ఒకరు నెవెడాలోని రెనో స్కూల్లో సోమవారం నాడు ఓ లెక్కల టీచర్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే.