టీచర్ల హాజరుకు బయోమెట్రిక్!!
ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోంది. ఇప్పటికే వారి పనిగంటలను 30 నిమిషాల పాటు పెంచిన సర్కారు, తాజాగా వాళ్ల హాజరు విషయంలోనూ మరింత కఠినమైన నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధం అవుతోంది. సాధారణంగా పిల్లల హాజరు టీచర్లు తీసుకుంటే, టీచర్ల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ముందుగా విశాఖపట్నం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు.
దీంతోపాటు పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, తీసుకుంటున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై తమ నిరసనను తెలియజేసేందుకు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు.