Teachers MLC
-
రేపే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం జరగనున్న రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు శుక్రవారం ప్రచారం ముగిసిందని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎన్నికల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ఎటపాక, పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే జరుగుతుందని వివరించారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీచేస్తున్నారని, 17,467 మంది ఓటర్లుండగా 116 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా–గుంటూరు స్థానానికి 19 మంది బరిలో ఉన్నారని, 13,505 మంది ఓటర్లుండగా 111 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. -
వీడలేమంటూ..వీడ్కోలంటూ..
ఎక్కడో పుట్టి..ఎక్కడో ఎన్నికై.. ఇక్కడే కలిశాం..వీడలేమంటూ వీడ్కో లంటూ.. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన సభ్యులు శనివారం చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంతో విడిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ విభజ న జరగడం..ఇటీవల కొత్త పాలకవర్గాలు ఎన్నిక కావడంతో అరవై ఏళ్ల అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. చివరిరోజు ఆత్మీయ పలకరింపులు..సన్మానాలు, సత్కారాలు, ఆద్యంతం ఉద్విగ్న భరిత వాతావరణంలో సభ్యులంతా పాత జెడ్పీకి బైబై చెప్పారు. సాక్షి, ఆదిలాబాద్: యాభై రెండు మంది జెడ్పీటీసీలు.. పది మంది శాసన సభ్యులు.. అందులోంచే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. జిల్లా ఉన్నతాధికారులు.. వీరంతా ఒకేసారి కలిసేది ఉమ్మడి జెడ్పీ సమావేశం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాల కలెక్టర్లు అదనపు ఆకర్షణగా నిలిచింది. చరిత్ర కలిగిన ఉమ్మడి జెడ్పీ ఠీవి ఇక ముగిసిన ప్రస్థానం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జెడ్పీ పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనుండగా, ఉమ్మడి జిల్లాలోని పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల పూర్తి కావస్తుంది. అంతకుముందు చివరిసారిగా సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్పర్సన్ వి.శోభాసత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్, ఇన్చార్జి ఆదిలాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి, మంచిర్యాల జేసీ సురేందర్‌రావు, నిర్మల్ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. మధుర క్షణాలు.. ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. వేదికను జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్, జేసీలు, జెడ్పీ సీఈఓ కె.నరేందర్ అలంకరించారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు వేదిక ఎదురుగా ఆసీనులయ్యారు. జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అదే వరుసలో కూర్చున్నారు. సమావేశం మధ్యలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ పాలకవర్గానికి ఇదే చివరి సభ అని, జూలై 4 వరకు పదవీ కాలం ఉన్నా అధికారికంగా సభ ఇదే చివరిదని పేర్కొన్నారు. ఈ సభలో సభ్యులు హుందాగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రధాన అంశాలపైనే చర్చ.. ఉమ్మడి జెడ్పీ చివరి సమావేశంలో ఎజెండా అంశాలు అనేకంగా ఉన్నా ప్రధాన అంశాలపైనే చర్చ సాగింది. సమావేశంలోనే సభ్యులకు వీడ్కోలులో భాగంగా సన్మానం చేయాలని ముందుగానే నిర్ణయించడంతో ప్రధాన అంశాల మట్టుకు చర్చించారు. మిషన్ భగీరథ, హరితహారం, వ్యవసాయంపై మాట్లాడారు. సభలో జెడ్పీటీసీలు అశోక్, జగ్జీవన్, సుజాత, రాథోడ్ విమల, కేశవ్‌గిత్తే వివిధ అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా వర్షాలు పడిన తర్వాత హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి ఐకేరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండె దిటువు.. సన్మాన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సభ్యుల్లో తాము ఇక ఒకేచోట కలవలేమన్న ఆవేదన కనిపించింది. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన ప్రస్తానం వారి కళ్లముందు కదలాడింది. మొదట సభ్యులు సభ ప్రాంగణంలోకి వస్తున్న సమ యంలోనూ అందరిలో ఈ పాలకవర్గానికి ఇదే చివరి సభ కావడంతో వస్తువస్తూనే ఒకరికొకరు పలకరించుకోవడం కనిపించింది. మహిళ సభ్యులు గుమిగూడి మాట్లాడుకోవడం అగు పించింది. పురుష సభ్యులు కరచలనం చేసుకుంటూ కనిపించారు. మొత్తం మీదా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వీడ్కోలు ఘట్టం వారి హావభావాలతో కొనసాగింది. మొదట ఉమ్మడి జిల్లా మంత్రి ఐకేరెడ్డిని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణిని మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, తదితరులను సన్మానించి మెమోంటోలను అందజేశారు. సభ్యులకు సన్మానం.. జెడ్పీటీసీలకు ఆ తర్వాత సన్మానం నిర్వహించారు. మొదట మహిళా జెడ్పీటీసీలను అనంతరం మిగతా జెడ్పీటీసీలకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. జైనూర్ జెడ్పీటీసీ మస్రత్ ఖానమ్‌ను సన్మానించినప్పుడు ఆమె ప్రసంగించారు. ఐదేళ్లు సభలో ఎంతో నేర్చుకున్నామని, ఏదైన తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేల సహకారం మరవలేనిదన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరిలో ఒక రకమైన ఆవేదన కనిపించింది. అనంతరం సభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఐదేళ్ల జ్ఞాపకాలను చివరి రోజు మధుర ఘట్టంగా మలుచుకున్నారు. అదే సందర్భంలో మంత్రి ఐకేరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలుగా పదవి కాలం ముగిసినప్పటికీ భవిష్యత్‌లో ఇతర పదవుల ద్వారా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. -
ఎమ్మెల్సీ పోరు..!
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగి సింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచా యతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకదాని తరువాత ఒకటి నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు సమాయత్తమవుతోంది. మార్చి 31తో ముగియనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదును ఎన్నికల సంఘం మొదటి విడతగా ప్రారంభించింది. కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గంలో ఒక గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయల ఎమ్మెల్సీల కోసం ఎన్నికలను నిర్వహించడానికి సీఈవో షెడ్యూల్ జారీ చేయడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఓటర్లతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇం దులోభాగంగానే వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాలో కూడా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్ల మొబైల్ నెంబర్లను సేకరించి ఎస్ఎంఎస్లను పంపేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఓటు నమోదు కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి ఓటర్లలో అవగాహన కల్పించి ఇప్పటికే ఓటు నమోదు చేయించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో...? పీఆర్టీయూటీఎస్ ముందు వరుసలో ఉన్నది. తమ సంఘం తరఫున కరీంనగర్ నుంచి రఘోత్తంరెడ్డిని బరిలో నిలిపింది. టీటీఎఫ్ నుంచి రాములును బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఎస్టీయూ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మామిడి సుధాకర్‌రెడ్డిని ఇటీవలే ప్రకటించింది. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని ఇది వరకే ఓ దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. పట్టభద్రుల బరిలో..? కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీ అభ్యర్థిగా మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ప్రైవేట్ పాఠశాలల తరఫున ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, గ్రూప్–1 ఉద్యోగుల సంఘం తరఫున మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కిమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పేర్యాల దేవేందర్‌రావు గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఓటు నమోదుకు ముందుకురాని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ దాదాపు 40 శాతం ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేయించుకోలేదని సమాచారం. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో దాదాపు 27 వేలవరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటే.. ఇప్పటివరకు 14 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలోను ఇప్పటివరకు సుమారు 62వేల మంది వరకు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకు సగం శాతం కూడా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోకపోవడం విశేషం. తక్కువ సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్న నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి జనవరి 31 వరకు ఎన్నికల సంఘం గడువును పొడగించింది. -
మిగిలింది ఆ ఇద్దరే!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం తరఫున పోటీ చేయాలనుకునే జాబితాలో మాజీ మంత్రి పరసారత్నం, తిరుపతికి చెందిన సైకాలజిస్ట్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. చదలవాడ సుచరిత స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు అడుగులు వేస్తుండగా, సాహితీ వేత్త సాకం నాగరాజు, మదనపల్లి డిప్యూటీ ఈవో వాసుదేవనాయుడు పేర్లు జాబితా నుంచి ఎప్పుడో తొలగించారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించడం, మంత్రి నారాయణ పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించడంతో ఆ పార్టీ మద్దతు సంపాదిస్తే గెలవచ్చనే ఆశతో మొదట చాలామంది పోటీ పడ్డారు. సామాజిక సమీకరణలు, ఆర్థిక బలం, పరిచయాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు సన్నిహితుడు, టీడీపీ సర్వే బృందాల సలహాదారుడు శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీని నియమించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశావహుల జాబితాలు దగ్గర పెట్టుకుని వారి అనుకూల, వ్యతిరేక అంశాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. మద్దతు కోరిన వారితో పాటు గెలిచే అవకాశం ఉన్న ఇతరుల గురించి కూడా క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. ఈ జాబితాలో తిరుపతికి చెందిన సాహితీవేత్త సాకం నాగరాజు పేరు తెర మీదకు వచ్చింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సీపీఐ మద్దతు అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ కారణంతో ఆయనను పోటీకి దించేందుకు టీడీపీ నేతలు ఆయనతో మాట్లాడారు. కొన్ని రోజులు తటపటాయించిన ఆయన చివరకు తాను పోటీ చేయలేనని చెప్పేశారు. మదనపల్లి డెప్యూటీ ఈవో వాసుదేవనాయుడు అభ్యర్థిత్వానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మద్దతు లభించదనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఆయన పేరు పక్కన పెట్టింది. మిగిలింది వారే.. అనేక సమీకరణల అనంతరం ప్రస్తుతానికి తెలుగుదేశం జాబితాలో మాజీ మంత్రి పరసారత్నం, సైకాలజిస్ట్ ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. పరసారత్నంను బరిలోకి దించితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక నాయకుడిని తృప్తి పరిచినట్లు అవుతుందని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో రత్నంకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదనే అంచనా వేస్తోంది. రత్నం పేరుకు సూళ్లూరుపేట వాసి అయినా ఆయన స్నేహితాలు, బంధుత్వాలు, పరిచయాలు మొత్తం తిరుపతి, చిత్తూరు జిల్లాతోనే ముడిపడి ఉన్నాయి. పైగా దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గ ఓటర్లను కూడా ప్రభావితం చేయగలరని టీడీపీ నాయకత్వం అంచనావేస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు రెండూ నెల్లూరు జిల్లాకే ఇస్తే మిగిలిన జిల్లాల నుంచి వ్యతిరేకత వస్తుందా? అనే అనుమానం కూడా పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఏదైతే అది కానీ అనుకుంటే పరసాను బరిలోకి దించే అవకాశం వుంది. అధిష్టాన వర్గం పోటీచేయాలని ఆదేశించి సరంజామా సిద్ధం చేస్తే బరిలోకి దూకాలని రత్నం భావిస్తున్నారు. ఇక పోతే తిరుపతికి చెందిన సైకాలజిస్ట్ ఎన్బీ సుధాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలిస్తోంది. సుధాకర్‌రెడ్డి శుక్రవారం తిరుపతిలో తనను కలసినపుడు చూద్దాంలే అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పట్టభద్రుల స్థానం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినందువల్ల ఉపాధ్యాయ స్థానం కూడా ఇదే సామాజిక వర్గానికి ఇస్తే ఉపయోగం ఉంటుందా? అని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. రెడ్డి సామాజిక వర్గమైతేనే ఉపాధ్యాయ స్థానం కూడా గెలుస్తామని ఎన్బీ అనుకూల నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఏనిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సుచరిత ద్విముఖ వ్యూహం.. టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత ఉపా«ధ్యాయ స్థానం నుంచి శాసనమండలికి పోటీ చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు. టీడీపీ మద్దతు సంపాదించాలని ఆమె గట్టిగానే ప్రయత్నించారు. సీపీఎం, సీపీఐ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలకు వ్యతిరేకంగా ఉండే ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టేందుకు చాలా కాలం నుంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తన అభ్యర్థిత్వం పరిశీలించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆమె వినతి పత్రం ఇచ్చారు. ఆమె భర్త టీటీడీ చైర్మన్‌గా ఉండగా ఆమెకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మద్దతు ఇవ్వడం మంచిది కాదనే ఉద్దేశంతో సుచరిత అభ్యర్థనను లోకేష్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ వైపు నుంచి నరుక్కు రావడానికి ఆమె పాచికలు వేశారు. బీజేపీ అనుబం«ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మద్దతు సంపాదించారు. సుచరితకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.బాపిరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖరరావు ప్రకటించారు. టీడీపీ నేరుగా మద్దతు ఇవ్వక పోయినా బీజేపీ మద్దతు అభ్యర్థిగా తనను బలపరచక తప్పదనే అంచనాతో సుచరిత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ స్థానం తమకు ఇవ్వాలని బీజేపీ నేతల ద్వారా టీడీపీ అధినాయకత్వం మీద ఒత్తిడి చేయిస్తున్నారు. ఈ ప్రయత్నం నెరవేరినా, విఫలమైనా స్వతంత్రంగా బరిలోకి దూకడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె మూడు జిల్లాల్లోని అనేక ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సుచరిత కూడా టీడీపీ జాబితా నుంచి వెళ్లిపోయినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.