సాక్షి ప్రతినిధి, నెల్లూరు:తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం తరఫున పోటీ చేయాలనుకునే జాబితాలో మాజీ మంత్రి పరసారత్నం, తిరుపతికి చెందిన సైకాలజిస్ట్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. చదలవాడ సుచరిత స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు అడుగులు వేస్తుండగా, సాహితీ వేత్త సాకం నాగరాజు, మదనపల్లి డిప్యూటీ ఈవో వాసుదేవనాయుడు పేర్లు జాబితా నుంచి ఎప్పుడో తొలగించారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించడం, మంత్రి నారాయణ పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించడంతో ఆ పార్టీ మద్దతు సంపాదిస్తే గెలవచ్చనే ఆశతో మొదట చాలామంది పోటీ పడ్డారు. సామాజిక సమీకరణలు, ఆర్థిక బలం, పరిచయాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు సన్నిహితుడు, టీడీపీ సర్వే బృందాల సలహాదారుడు శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీని నియమించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశావహుల జాబితాలు దగ్గర పెట్టుకుని వారి అనుకూల, వ్యతిరేక అంశాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. మద్దతు కోరిన వారితో పాటు గెలిచే అవకాశం ఉన్న ఇతరుల గురించి కూడా క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. ఈ జాబితాలో తిరుపతికి చెందిన సాహితీవేత్త సాకం నాగరాజు పేరు తెర మీదకు వచ్చింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సీపీఐ మద్దతు అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ కారణంతో ఆయనను పోటీకి దించేందుకు టీడీపీ నేతలు ఆయనతో మాట్లాడారు. కొన్ని రోజులు తటపటాయించిన ఆయన చివరకు తాను పోటీ చేయలేనని చెప్పేశారు. మదనపల్లి డెప్యూటీ ఈవో వాసుదేవనాయుడు అభ్యర్థిత్వానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మద్దతు లభించదనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఆయన పేరు పక్కన పెట్టింది.
మిగిలింది వారే..
అనేక సమీకరణల అనంతరం ప్రస్తుతానికి తెలుగుదేశం జాబితాలో మాజీ మంత్రి పరసారత్నం, సైకాలజిస్ట్ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. పరసారత్నంను బరిలోకి దించితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక నాయకుడిని తృప్తి పరిచినట్లు అవుతుందని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో రత్నంకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదనే అంచనా వేస్తోంది. రత్నం పేరుకు సూళ్లూరుపేట వాసి అయినా ఆయన స్నేహితాలు, బంధుత్వాలు, పరిచయాలు మొత్తం తిరుపతి, చిత్తూరు జిల్లాతోనే ముడిపడి ఉన్నాయి. పైగా దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గ ఓటర్లను కూడా ప్రభావితం చేయగలరని టీడీపీ నాయకత్వం అంచనావేస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు రెండూ నెల్లూరు జిల్లాకే ఇస్తే మిగిలిన జిల్లాల నుంచి వ్యతిరేకత వస్తుందా? అనే అనుమానం కూడా పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఏదైతే అది కానీ అనుకుంటే పరసాను బరిలోకి దించే అవకాశం వుంది. అధిష్టాన వర్గం పోటీచేయాలని ఆదేశించి సరంజామా సిద్ధం చేస్తే బరిలోకి దూకాలని రత్నం భావిస్తున్నారు. ఇక పోతే తిరుపతికి చెందిన సైకాలజిస్ట్ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలిస్తోంది. సుధాకర్‌రెడ్డి శుక్రవారం తిరుపతిలో తనను కలసినపుడు చూద్దాంలే అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పట్టభద్రుల స్థానం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినందువల్ల ఉపాధ్యాయ స్థానం కూడా ఇదే సామాజిక వర్గానికి ఇస్తే ఉపయోగం ఉంటుందా? అని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. రెడ్డి సామాజిక వర్గమైతేనే ఉపాధ్యాయ స్థానం కూడా గెలుస్తామని ఎన్‌బీ అనుకూల నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఏనిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
సుచరిత ద్విముఖ వ్యూహం..
టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత ఉపా«ధ్యాయ స్థానం నుంచి శాసనమండలికి పోటీ చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు. టీడీపీ మద్దతు సంపాదించాలని ఆమె గట్టిగానే ప్రయత్నించారు. సీపీఎం, సీపీఐ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలకు వ్యతిరేకంగా ఉండే ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టేందుకు చాలా కాలం నుంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తన అభ్యర్థిత్వం పరిశీలించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆమె వినతి పత్రం ఇచ్చారు. ఆమె భర్త టీటీడీ చైర్మన్‌గా ఉండగా ఆమెకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మద్దతు ఇవ్వడం మంచిది కాదనే ఉద్దేశంతో సుచరిత అభ్యర్థనను లోకేష్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ వైపు నుంచి నరుక్కు రావడానికి ఆమె పాచికలు వేశారు. బీజేపీ అనుబం«ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మద్దతు సంపాదించారు. సుచరితకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.బాపిరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖరరావు ప్రకటించారు. టీడీపీ నేరుగా మద్దతు ఇవ్వక పోయినా బీజేపీ మద్దతు అభ్యర్థిగా తనను బలపరచక తప్పదనే అంచనాతో సుచరిత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ స్థానం తమకు ఇవ్వాలని బీజేపీ నేతల ద్వారా టీడీపీ అధినాయకత్వం మీద ఒత్తిడి చేయిస్తున్నారు. ఈ ప్రయత్నం నెరవేరినా, విఫలమైనా స్వతంత్రంగా బరిలోకి దూకడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె మూడు జిల్లాల్లోని అనేక ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సుచరిత కూడా టీడీపీ జాబితా నుంచి వెళ్లిపోయినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మిగిలింది ఆ ఇద్దరే!
Published Sun, Dec 18 2016 3:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement