ఎన్డీ దళ సభ్యుడి లొంగుబాటు
3006 సెమీ ఆటోమేటిక్ రైఫిల్–20 రౌండ్లు,
9 ఎంఎం కార్బన్ ఆరు రౌండ్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఓఎస్డీ భాస్కరన్
ఇల్లెందు :
మూడునెలల పాటు అజ్ఞాత దళంలో పనిచేసి రెండు ఆయుధాలతో పరారైన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ దళ సభ్యులు జాడి వీరస్వామి (19) లొంగిపోయినట్లు కొత్తగూడెం ఓఎస్డీ భాస్కరన్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
‘గుండాల మండలం సాయనపల్లి పంచాయతీ దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి న్యూడెమోక్రసీ దళంలో మూడు నెలల పాటు పనిచేశాడు. రెండు ఆయుధాలతో లొంగిపోయాడు. తొలుత న్యూడెమోక్రసీ రాయలవర్గం గుండాల ఏరియా లింగన్న దళంలో చేరాడు. అనతి కాలంలోనే అక్కడి నుంచి బయటకు వచ్చి న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం గుండాల ఏరియాకు చెందిన సుధాకర్ దళంలో చేరాడు. ఆ పార్టీ విధానాలు నచ్చక రెండు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయాడు. వీరస్వామి నుంచి 3006 సెమీ ఆటోమెటిక్ రైఫిల్, 20 రౌండ్లు, 9 ఎం.ఎం కార్బన్, 6 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు..’ వివరించారు. వీరస్వామి హైద్రాబాద్ సమీపంలోని ఉప్పల్ వద్ద దళంలో చేరాడన్నారు. అతనికి ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పిస్తామన్నారు. వివిధ నక్సల్స్ గ్రూపుల్లో దళనేతలుగా, సభ్యులుగా ఉన్న వారంతా లొంగిపోయి ప్రభుత్వ పునరావాసం పొందవచ్చునని తెలిపారు. అజ్ఞాతంలో చేరి అనారోగ్యం పాలు కావటం, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయడం మినహా ఏమీ ఉండదన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆర్. వీరేశ్వరరావు, ఇల్లెందు, గుండాల సీఐలు అల్లం నరేందర్, టి.రవి, ఇల్లెందు ఎస్సైలు సతీష్, కొమురెల్లి, రామారావు, ప్రొబేషనరీ ఎస్సై అశోక్ పాల్గొన్నారు.