Tech park
-
క్యాపిటాల్యాండ్ చేతికి ఐటీ పార్క్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ ద్వారా పుణేలోని ఐటీ పార్క్‌ను కొనుగోలు చేయనున్నట్లు క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ తాజాగా పేర్కొంది. ఎకో స్పేస్ ఐటీ పార్క్ ప్రయివేట్ లిమిటె ద్వారా ఇందుకు అసెండస్ ఐటీ పార్క్(పుణే)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ ఐటీ సెజ్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి రూ. 1,350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ సెజ్ నాలుగు భవంతులతో మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్న ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ ఆస్తిలో దాదాపు 100 శాతం ఐటీ, ఐటీ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలకు లీజ్‌కిచ్చారు. వీటిలో ఇన్ఫోసిస్, సినెక్రాన్ టెక్నాలజీస్ తదితర కంపెనీలున్నాయి. కాగా.. అసెండస్ ఐటీ పార్క్ లో క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ 78.5 శాతం వాటా, భాగస్వామి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 21.5 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకోనున్నాయి. చదవండి: ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ! -
లోకేష్ ప్రారంభించిన టెక్‌పార్క్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, అమరావతి : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఆర్టీ టెక్ పార్క్‌లో ఐటీ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ జనవరి, 17నే వీటిని ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఆర్టీ టెక్ పార్క్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫస్ట్ ఫ్లోర్‌లోని చార్వికెంట్ ఐటీ కంపెనీలోకి వ్యాపించిన మంటలు.. ఆ వెంటనే సెకండ్ ఫ్లోర్‌లోని అద్వైత ఐటీ కంపెనీకి వ్యాపించాయి. చార్వికెంట్ ఐటీ కంపెనీకి చెందిన 12 కంప్యూటర్లు, ఫర్నిచర్ తదితర సామగ్రి దగ్ధంకాగా, అద్వైత ఐటీ కంపెనీని ఇటీవల ప్రారంభించడంతో పూర్తి స్థాయిలో కంప్యూటర్లు బిగించకపోవడంతో కొద్దిపాటి నష్టమే జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి రావడం ఆలస్యంకావడంతో లోపల్నుంచి ఎగిసిపడుతున్న మంటల ఉధృతి తగ్గించేందుకు యువకుల సాయంతో పోలీసులు అద్దాలు పగులగొట్టించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఆదివారం అయినందున ఆయా కంపెనీల్లో సిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై తమకు పూర్తి సమాచారం లేదని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయా.. లేక ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తగలబెట్టారా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. భవనంలో సేఫ్టీ మెజర్స్ ఏ మాత్రం లేకున్నా నాయకుల ఒత్తిడి మేరకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. -
ఆ టెక్ పార్కులో అందరూ మహిళలే!
బెంగళూరు: నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హరోహల్లి గ్రామం వద్ద 300 ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం కేవలం మహిళల కోసమే టెక్నాలజి పార్కును ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక, సమాచార రంగంలో కూడా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే సత్సంకల్పతో కర్ణాటక ప్రభుత్వం 2014-2019 పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ టెక్ పార్క్‌ను డిజైన్ చేయడానికి మహిళా ఆర్కిటెక్ట్‌లను, మహిళా కాంట్రాక్టులను మాత్రమే పిలవడం మరో విశేషం. ఇందులో వివిధ వెంచర్లను ప్రారంభించేందుకు గత కొన్ని వారాల్లోనే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల నుంచి 56 దరఖాస్తులు అందాయని రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ కే. రత్న ప్రభ మీడియాకు తెలిపారు. ఈ పార్కులో ఐటీలు, ఐటీస్తోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, టెలికామ్, ఎలక్ట్రానిక్స్ తదితర వెంచర్లను ప్రారంభించేందుకుగాను ఈ దరఖాస్తులు వచ్చాయని, 135 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,800 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఆమె వివరించారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన ఈ పార్కులో తమ వెంచర్లు ప్రారంభించేందుకు ఇకియా, వాల్‌మార్ట్, టొయోటా లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్సాహం చూపుతున్నాయని రత్న ప్రభ తెలిపారు. ఈ పార్కును ఈ ఏడాది నవంబర్ నెల నాటికి పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ పార్కుకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని మైసూర్, హుబ్బలి-ధార్వాడ్, బెలగావి, బళ్లారిలో కూడా ప్రత్యేక మహిళా క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు పరిధిలో కూడా మహిళలకు 942 ప్లాట్లను కేటాయించామని అన్నారు.