బెంగళూరు: నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హరోహల్లి గ్రామం వద్ద 300 ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం కేవలం మహిళల కోసమే టెక్నాలజి పార్కును ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక, సమాచార రంగంలో కూడా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే సత్సంకల్పతో కర్ణాటక ప్రభుత్వం 2014-2019 పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ టెక్ పార్క్‌ను డిజైన్ చేయడానికి మహిళా ఆర్కిటెక్ట్‌లను, మహిళా కాంట్రాక్టులను మాత్రమే పిలవడం మరో విశేషం. ఇందులో వివిధ వెంచర్లను ప్రారంభించేందుకు గత కొన్ని వారాల్లోనే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల నుంచి 56 దరఖాస్తులు అందాయని రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ కే. రత్న ప్రభ మీడియాకు తెలిపారు.
ఈ పార్కులో ఐటీలు, ఐటీస్‌తోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, టెలికామ్, ఎలక్ట్రానిక్స్ తదితర వెంచర్లను ప్రారంభించేందుకుగాను ఈ దరఖాస్తులు వచ్చాయని, 135 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,800 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఆమె వివరించారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన ఈ పార్కులో తమ వెంచర్లు ప్రారంభించేందుకు ఇకియా, వాల్‌మార్ట్, టొయోటా లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్సాహం చూపుతున్నాయని రత్న ప్రభ తెలిపారు.
ఈ పార్కును ఈ ఏడాది నవంబర్ నెల నాటికి పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ పార్కుకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని మైసూర్, హుబ్బలి-ధార్వాడ్, బెలగావి, బళ్లారిలో కూడా ప్రత్యేక మహిళా క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు పరిధిలో కూడా మహిళలకు 942 ప్లాట్లను కేటాయించామని అన్నారు.
ఆ టెక్ పార్కులో అందరూ మహిళలే!
Published Thu, Apr 7 2016 8:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement