ఏపీ: టీసీసీ పరీక్షలు 26కు వాయిదా
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పరీక్షల విభాగ ఆధ్వర్యంలో బుధవారం నుంచి జరగాల్సిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈనెల 26వ తేదీకి వాయిదా పడ్డాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టరేట్ సవరించిన టైం టేబుల్‌ను సోమవారం విడుదల చేసింది. నూతన టైం టేబుల్ ప్రకారం..
►డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈనెల 26 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా మొత్తం 8 పేపర్లతో జరగనున్నాయి.
►26, 27 తేదీల్లో హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
►అలాగే, 26న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్.. 27, 28 తేదీల్లో హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరగనున్నాయి.
►హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్ ఈనెల 27 నుంచి మే ఆరో తేదీ వరకు జరుగుతాయి. కాగా, గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ హైస్కూల్, స్టాల్ బాలికోన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 530 మంది హాజరుకానున్నారు.
పరీక్షల నిర్వహణలో ప్రణాళికా లోపం..
కాగా, టీసీసీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ పరీక్షల విభాగ ప్రణాళికా లోపం స్పష్టంగా కనబడుతోంది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 17–24 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఏప్రిల్ ఏడో తేదీకి వాయిదా వేశారు. తీరా ఈ నెల ఏడో తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసిన అధికారులు హాల్ టిక్కెట్లను సైతం వెబ్సైట్లో పొందుపర్చారు. పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకుని ఎదురుచూస్తున్న సమయంలో మరోసారి పరీక్షలను వాయిదా వేశారు. ఈ విధంగా మొత్తం 40 రోజుల పాటు వాయిదా వేశారు. టీసీసీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే ఒకటో తేదీ నుంచి 40 రోజుల పాటు సమ్మర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించాల్సి ఉంది. ఈ విధంగా పరీక్షల నిర్వహణలో దాదాపు 40 రోజుల పాటు జాప్యం నెలకొనడంతో సమ్మర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహణపై స్పష్టత కొరవడింది.
చదవండి:
మద్యం మత్తులో ఏఎస్పీ హల్చల్
జనసేన, టీడీపీ చెట్టాపట్టాల్..