ఈ ప్రపంచంలో తనే అందగత్తె!
‘‘మా జీవితాల్లోంచి ఆమె వెళ్లిపోయి దాదాపు ఏడేళ్లవుతున్నా మా మనసు పొరల్లో ఆవిడ జ్ఞాపకాలు చెరిగిపోలేదు.. ఊపిరి ఉన్నంతవరకూ చెరిగిపోవు కూడా’’ అని ఒకింత ఉద్వేగంగా అమితాబ్ బచ్చన్ తన ‘బ్లాగ్’లో పొందుపరిచారు. ఆయన తల్లి తేజీ బచ్చన్ చనిపోయి నిన్నటితో ఏడేళ్లవుతోంది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన తల్లి గురించి ఇంకా మాట్లాడుతూ -‘‘లీలావతి ఆస్పత్రిలో మా అమ్మ జీవన్మరణ పోరాటం సాగించిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేను., ఓ పులిలా ధైర్యంగా పోరాడింది. ‘ఏం ఫర్వాలేదు.. మీ అమ్మగారు కోలుకుంటారు’ అని డాక్టర్లు చెప్పేవారు.
అలా చెప్పిన కొన్ని నిమిషాలకే అమ్మ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యేది. డాక్టర్లు ఆమె గుండె ఆగిపోతుందేమోనని ఆందోళనపడేవారు. ఇంజక్షన్లు ఇచ్చేవాళ్లు. చెస్ట్ని పంప్ చేసేవాళ్లు. అమ్మ ప్రత్యక్ష నరకం చవిచూసేది. మా అమ్మని ఆ స్థితిలో చూస్తానని ఏనాడూ ఊహించలేదు. ఆమె బాధ చూసి, మనసులోనే కుమిలిపోయేవాణ్ణి. ఏ బిడ్డ అయినా తల్లి బతికితే బాగుండు అని కోరుకుంటుంది. కానీ, అమ్మకు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తే బాగుండు అని నేను కోరుకునేవాణ్ణి. అమ్మ బెడ్ చుట్టూ డాక్టర్లు గుమిగూడిపోయి బతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవారు.
ఆ ప్రయత్నాలన్నీ ఆమెను ఇంకా బాధపెట్టేవి. అందుకే డాక్టర్ల దగ్గర మా అమ్మను ఇక బాధపెట్టొద్దు అని చెప్పాను. ఆమె తుది శ్వాస విడిచిన ఆ క్షణం అచేతనంగా అలా నిలబడి చూస్తుండిపోవడం మినహా ఏమీ చేయలేకపోయాను. మా అమ్మ రూపం మనసులో అలా మిలిగిపోయింది. నా దృష్టిలో ఈ ప్రపంచంలోనే అందగత్తె ఎవరంటే అది మా అమ్మే’’ అని పేర్కొన్నారు.