Tekkali police
-
బయటకు మాత్రమే అవి బస్తాలు; అసలు కథ వేరే ఉంది
టెక్కలి రూరల్: కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మాటున రవాణా అవుతున్న గుట్కా ప్యాకెట్లను టెక్కలి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి నుంచి అక్రమంగా గుట్కా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు టెక్కలి సీఐ ఆర్ నీలయ్య, ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు సిబ్బందితో కలిసి నర్సింగపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఏపీ 39టీఎం 8581 నంబర్ బొలేరో వాహనంలో కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మధ్య అక్రమంగా రవాణా చేస్తున్న 19 బస్తాల గుట్కా, 30 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వ్యాన్‌తో పాటు గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముదిలి బాలకృష్ణ, సవర చిన్నలపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
చైన్‌స్నాచింగ్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు..
టెక్కలి: ముగ్గురు మహిళల మెడల్లో ఉన్న పుస్తెలు తాళ్లను తెంచడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి చివరకు స్థానికులకు చిక్కి ప్రస్తుతం పోలీసులో అదుపులో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి పొండ్రేటి దేవి అనే యువతి పాత జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై వచ్చి ఆమె మెడలో గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బీఎస్ అండ్ జేఆర్ పాఠశాల సమీపంలో బత్తుల లక్ష్మి మెడలో పుస్తెలు తాడు చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె కూడా కేకలు వేయడంతో పాల కేంద్రం ఎదురుగా తొలుసూరుపల్లి వైపు పరారయ్యాడు. దీంతో లక్ష్మి అక్కడే ఉన్న స్థానికులను అప్రమత్తం చేసింది. అదే సమయంలో ఆ వ్యక్తి ఎన్టీఆర్ కాలనీ వైపు నుంచి మళ్లీ పోలీస్‌స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏలూరి లక్ష్మి, రౌతుల సుశీల, రౌతుల కుసుమ అదే మార్గం నుంచి వెళ్తుండగా ఏలూరి లక్ష్మి మెడలో పుస్తెలు తెంచే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇంతలో బత్తుల లక్ష్మి అప్రమత్తం చేసిన స్థానిక మెకానిక్ రాంబాబుతో పాటు మరికొంత మంది వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచిచన నిందితుడితో పాటు అతని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఐ కె.భవానీప్రసాద్, ఎస్సైలు రాజేష్, నర్సింహమూర్తిలు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళల మెడల్లో బంగారం చోరీ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి రేగిడి మండలం వాయిలవలస గ్రామానికి చెందిన కొర్తు వెంకటరమణగా విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతానికి ఈయన బరంపురంలో స్థిర పడి బొంతల వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు.