టెక్కలి: ముగ్గురు మహిళల మెడల్లో ఉన్న పుస్తెలు తాళ్లను తెంచడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి చివరకు స్థానికులకు చిక్కి ప్రస్తుతం పోలీసులో అదుపులో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి పొండ్రేటి దేవి అనే యువతి పాత జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వచ్చి ఆమె మెడలో గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బీఎస్ అండ్ జేఆర్ పాఠశాల సమీపంలో బత్తుల లక్ష్మి మెడలో పుస్తెలు తాడు చేసేందుకు ప్రయత్నించగా..
ఆమె కూడా కేకలు వేయడంతో పాల కేంద్రం ఎదురుగా తొలుసూరుపల్లి వైపు పరారయ్యాడు. దీంతో లక్ష్మి అక్కడే ఉన్న స్థానికులను అప్రమత్తం చేసింది. అదే సమయంలో ఆ వ్యక్తి ఎన్టీఆర్ కాలనీ వైపు నుంచి మళ్లీ పోలీస్‌స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏలూరి లక్ష్మి, రౌతుల సుశీల, రౌతుల కుసుమ అదే మార్గం నుంచి వెళ్తుండగా ఏలూరి లక్ష్మి మెడలో పుస్తెలు తెంచే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇంతలో బత్తుల లక్ష్మి అప్రమత్తం చేసిన స్థానిక మెకానిక్ రాంబాబుతో పాటు మరికొంత మంది వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచిచన నిందితుడితో పాటు అతని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఐ కె.భవానీప్రసాద్, ఎస్సైలు రాజేష్, నర్సింహమూర్తిలు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళల మెడల్లో బంగారం చోరీ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి రేగిడి మండలం వాయిలవలస గ్రామానికి చెందిన కొర్తు వెంకటరమణగా విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతానికి ఈయన బరంపురంలో స్థిర పడి బొంతల వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు.
చైన్‌స్నాచింగ్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు..
Published Thu, May 14 2015 12:59 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement