telangana budjet sessions
-
అక్షరాలా రెండు లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల మార్క్ దాటబోతోంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.2.13 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బడ్జెట్ కంటే వచ్చే ఆర్థిక సంవత్సరం పద్దు దాదాపు రూ.39 వేల కోట్లు అధికం. రాష్ట్ర పన్నుల రాబడిలో 28% వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2 వేలు అదనంగా ఇవ్వాల్సి రావడం, ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి, రైతులకు రూ. లక్ష రుణమాఫీ వంటి హామీల అమలుతో బడ్జెట్ పరిమాణం పెరగనుంది. పెరిగిన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌కు పరిమితమవుతున్న కేసీఆర్ సర్కారు శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను బడ్జెట్లో ప్రస్తావించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న కొత్త పథకాలతో పాటు ఉన్నవాటిని పెంచేలా బడ్జెట్లో భారీ కేటాయింపులే చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆదాయం 90 వేల కోట్లే! ఈ ఏడాది పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది అంచనా వేసిన దానికంటే వృద్ధిరేటు ఎక్కువగా ఉండటంతో వచ్చే ఏడాదికి కూడా దాదాపు 18% ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది రాష్ట్ర పన్నుల ద్వారా రూ.73,751 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ కింద రూ.40వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. మార్చి 31వ తేదీ నాటికి అది రూ.43వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంటున్నారు. అలాగే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ విభాగాల నుంచి నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ రాబడి ఉంది. ఒక్క రవాణ శాఖ మాత్రమే టార్గెట్‌కు స్వల్ప దూరంలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గత డిసెంబర్ 31వ తేదీ నాటికి నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. దీంతో వచ్చే ఏడాది ఆ మొత్తాన్ని రూ.82 వేల కోట్లకు పెంచడంతో పాటు పన్నేతర ఆదాయం రూ.13 వేల కోట్లుగా ఉంటుందని భావించి రూ.95 వేల కోట్లుగా అంచనా వేసింది. మూలధన వసూళ్ల కింద ఈ ఏడాది రూ.43,507 కోట్లు నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని రూ.55వేల కోట్లకు పెంచింది. ఇవి కాకుండా కేంద్ర పన్నుల వాటా కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,207 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే లభించినట్లు సమాచారం. ఈ ఏడాది అంచనా వేసిన మొత్తం పెరడగంతో దాని ఆధారంగా వచ్చే ఏడాదికి రూ.25వేల కోట్లుగా అంచనా వేసిందని సమాచారం. ఇక కేంద్ర గ్రాంట్ల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,041 కోట్లు అంచనా వేసిన ప్రభుత్వం వచ్చే ఏడాదికి రూ.38 వేల కోట్లు వస్తుందని భావిస్తోంది. సాగునీటికి 25 వేల కోట్లు ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తంలో కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో సింహభాగం వ్యవసాయం, సంక్షేమానికే కేటాయించినట్లు తెలిసింది. గడచిన ఏడాది రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2వేలు పెంచి.. రూ.10వేలు చేయడంతోపాటు రూ.లక్ష అంతకంటే తక్కువ మొత్తంలో ఉన్న రైతు రుణాలను నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి వీలుగా బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగినట్లు సమాచారం. -
రాష్ట్ర సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదు
-
సభలో రణరంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో మునుపెన్నడూ లేని దృశ్యం ఆవిష్కృతమైంది. సభ ప్రారంభంలో జాతీయ గీతాలాపన సమయం నుంచే నిరసనల హోరు మొదలైంది. అదేక్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. తీవ్ర తోపులాట జరిగింది. ఈ గందరగోళ పరిస్థితి మధ్యే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ప్రసంగించారు. శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అసెంబ్లీ సమావేశ మందిరం రణరంగాన్ని తలపించింది. ఉదయం సభ ప్రారంభంకాగానే అసెంబ్లీ ప్రాంగణానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కలసి ఆయనను సమావేశ మందిరంలోకి సాదరంగా స్వాగతించారు. గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలోనే అలజడి మొదలైంది. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ప్రారంభించారు. అయితే ప్రతిపక్ష నేత జానారెడ్డి కాంగ్రెస్ సభ్యులను వారించడంతో వారు వెంటనే నినాదాలను ఆపేశారు. ఈలోగానే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప నేత రేవంత్‌రెడ్డి తమ ముందున్న టేబుళ్లపైకి ఎక్కారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనే ఇది చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఆపడంతో తప్పు గ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గారు. అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు షేమ్.. షేమ్.. అంటూ నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మళ్లీ టేబుళ్లపైకి ఎక్కి గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేశారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకువచ్చి గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ప్రసంగం కాపీలను చించి గవర్నర్ మీదకు వెదజల్లారు. అప్రమత్తమైన మార్షల్స్ వెల్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ సభ్యులు రంగంలోకి దిగి మార్షల్స్ అవతారమెత్తారు. టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెనక్కి పంపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెల్‌లోకి వచ్చారు. నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, రాజేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ మధ్య తోపులాట జరిగి గొడవకు దారితీసింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, వేముల వీరేశం కల్పించుకుని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతుల్లోని ప్లకార్డులను లాగేసుకుని చించేశారు. ఈ తోపులాటలో ప్రకాశ్‌గౌడ్, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కిందపడిపోయారు. ఈ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ వెల్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఇక టేబుల్‌పై నిలబడి ప్రసంగ కాపీలను చించి గవర్నర్ మీదకు విసురుతున్న రేవంత్‌రెడ్డిని కిందకు దించేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌ను అడ్డుకున్నారు. చివరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సముదాయించి వెనక్కి తీసుకువచ్చారు. అయినా, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్ వెనక్కి రాకుండా హడావుడి చేశారు. 14 నిమిషాలపాటు కొనసాగిన గవర్నర్ ప్రసంగానికి చివరికంటా టీడీపీ, కాంగ్రెస్‌లు అడ్డుతగిలాయి. కాగా, బీజేపీ, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సభ్యులు తమ సీట్లలోనే కూర్చుని ఉండిపోయారు. గవర్నర్ మందలింపు సభ ప్రారంభంలోనే జాతీయ గీతాలాపన సమయంలో నిరసనకు దిగిన సభ్యులను గవర్నర్ నరసింహన్ వారించే ప్రయత్నం చేశారు. ఇక తన ప్రసంగం ముగిశాక మరోసారి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మరోసారి టేబుళ్లు ఎక్కి నినాదాలు చేస్తుండడంతో గవర్నర్ వారివైపు వేలు చూపిస్తూ మందలించారు. దీంతో వారిద్దరు వెనక్కి తగ్గారు. చివరకు నరసింహన్ వెళ్లిపోతుండగా గవర్నర్ డౌన్ డౌన్ అంటూ కొందరు నినాదాలు చేశారు. ఇదే సమయంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు ‘గవర్నర్ జిందాబాద్’ అని ప్రతి నినాదాలు చేశారు. -
సభకు నమస్కారం!
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. 17 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ అంశాలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, హామీల అమలులో జాప్యం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం వంటి వాటిపై రాజకీయపక్షాలన్నీ ఇప్పటికే భగ్గుమంటున్నాయి. దీంతో శనివారం నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాలు 17 రోజుల పాటు వాడివేడిగా సాగనున్నాయి. గత సమావేశాల సమయంలో రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలే అయినందున సభలో ప్రస్తావించేందుకు పెద్దగా అంశాలేవీ లేక విపక్షాలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. కానీ ఇప్పు డు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వంపై ఎక్కుపెట్టడానికి వాటి చేతిలో అనేక అస్త్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, బీజేపీ శాసనసభాపక్షాలు ఇప్పటికే సమావేశమై చర్చించుకోగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేసుకోనున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలన్న ప్రతిపాదన, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు, పది మాసాల కాలంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు అధికారపక్షం గణాంకాలతో సిద్ధమవుతోంది. కాగా, 11వ తేదీన రాష్ర్ట ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తొలిరోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఫిరాయింపులపై గర్జన కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయా పార్టీల నే తలు పట్టుదలగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈసారి మంత్రిగా సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన రాజీనామా వ్యవహారం అధికారపక్షానికి తల నొప్పిగా మారే అవకాశముంది. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అధికారపక్షం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందన్న అంశం ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. ఎమ్మెల్యే పదవికి మంత్రి తలసాని చేసిన రాజీనామాను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపైనా సభలో దుమారం రేగే అవకాశముంది. అలాగే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనుకోవడం, అక్కడి చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు మార్చాలన్న ప్రతిపాదనలను దాదాపు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలూ చేశాయి. ఈ విషయంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒకే మాటపై నిలబడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే సభలో సమన్వయంగా వ్యవహరించాలని భావిస్తున్నాయి. ప్రస్తుత సచివాలయంలో సకల సదుపాయాలు ఉన్నప్పటికీ వాస్తు పేరుతో దాన్ని ఎర్రగడ్డకు మార్చాలనడంపై బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హామీలేమయ్యాయి? రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన వేతన సవరణ స్కేళ్లకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువడకపోవడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతభత్యాలను అమలు చేస్తామన్న హామీని పట్టించుకోకపోవడంపై సర్కార్‌ను విపక్షాలు నిలదీసే అవకాశముంది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలైన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడం, ఎస్సీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం కూడా ప్రస్తావనకు రానుంది. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతల వ్యవహారం దుమారం రేపనుంది. ఇక రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ అంశం మరోసారి చర్చకు కానుంది. డిప్యూటీ సీఎంగా పనిచేసిన డాక్టర్ రాజయ్యను అవినీతి ఆరోపణలపై బర్తరఫ్ చేసిన విషయాన్నీ లేవనెత్తేందుకు విపక్షాలు కాచుక్కూర్చున్నాయి. పక్కా వ్యూహంతో అధికారపక్షం సిద్ధం విపక్షాలకు అవకాశమివ్వకుండా మంత్రులు సన్నద్ధంగా సభకు హాజరుకావాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో సిద్ధంకావాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను వివరించడం ద్వారా విపక్షాల నోళ్లు మూయించాలని సర్కారు భావిస్తోంది. ‘ధీటుగా స్పందిస్తాం. సరైన సమాధానాలతో తిప్పికొడతాం. గత సమావేశాల్లో మాదిరిగానే పైచేయి సాధిస్తాం. విపక్షాలే ఆత్మరక్షణలో ఉన్నాయి’ అని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, అమరవీరుల కుటుంబాలకు సాయం తదితర అంశాలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈసారి మంత్రివర్గంలో పలువురు సీనియర్లు చేరడం కూడా కలిసిరానుంది. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సమర ్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ విప్‌తోపాటు ముగ్గురు విప్‌లు, అయిదుగురు పార్లమెంటరీ కార్యదర్శులనూ రంగంలోకి దించి సభను సమర్థంగా నిర్వహించే వ్యూహంతో ఉంది. రెండు అసెంబ్లీల్లో ఒకేరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. పక్కపక్కనే రెండు అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు పోలీసులకు సవాలుగా మారాయి. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులను మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రవేశమార్గాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వీక్షించేందుకు సందర్శకులను అనుమతించరు. గ్యాలరీ లోకి కూడా పరిమిత సంఖ్యలోనే పాసులు జారీచేయాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 8.55 గంటలకు ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తరువాత 11 గంటలకు తెలంగాణ ఉభయసభల్లో ఆయన ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రెండు రాష్ట్రాల ఉభయసభలు సోమవారానికి వాయిదా పడతాయి.