బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ పై విపక్షాలు కాగితాలు విసిరిన దృశ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో మునుపెన్నడూ లేని దృశ్యం ఆవిష్కృతమైంది. సభ ప్రారంభంలో జాతీయ గీతాలాపన సమయం నుంచే నిరసనల హోరు మొదలైంది. అదేక్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. తీవ్ర తోపులాట జరిగింది. ఈ గందరగోళ పరిస్థితి మధ్యే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ప్రసంగించారు. శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అసెంబ్లీ సమావేశ మందిరం రణరంగాన్ని తలపించింది. ఉదయం సభ ప్రారంభంకాగానే అసెంబ్లీ ప్రాంగణానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కలసి ఆయనను సమావేశ మందిరంలోకి సాదరంగా స్వాగతించారు. గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలోనే అలజడి మొదలైంది. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ప్రారంభించారు. అయితే ప్రతిపక్ష నేత జానారెడ్డి కాంగ్రెస్ సభ్యులను వారించడంతో వారు వెంటనే నినాదాలను ఆపేశారు.
ఈలోగానే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప నేత రేవంత్‌రెడ్డి తమ ముందున్న టేబుళ్లపైకి ఎక్కారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనే ఇది చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఆపడంతో తప్పు గ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గారు. అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు షేమ్.. షేమ్.. అంటూ నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మళ్లీ టేబుళ్లపైకి ఎక్కి గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేశారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకువచ్చి గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ప్రసంగం కాపీలను చించి గవర్నర్ మీదకు వెదజల్లారు. అప్రమత్తమైన మార్షల్స్ వెల్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికార టీఆర్‌ఎస్ సభ్యులు రంగంలోకి దిగి మార్షల్స్ అవతారమెత్తారు.
టీఆర్‌ఎస్ వర్సెస్ టీడీపీ
గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెనక్కి పంపించేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెల్‌లోకి వచ్చారు. నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, రాజేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ మధ్య తోపులాట జరిగి గొడవకు దారితీసింది. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, వేముల వీరేశం కల్పించుకుని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతుల్లోని ప్లకార్డులను లాగేసుకుని చించేశారు. ఈ తోపులాటలో ప్రకాశ్‌గౌడ్, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కిందపడిపోయారు. ఈ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ వెల్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని టీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఇక టేబుల్‌పై నిలబడి ప్రసంగ కాపీలను చించి గవర్నర్ మీదకు విసురుతున్న రేవంత్‌రెడ్డిని కిందకు దించేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌ను అడ్డుకున్నారు. చివరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకుని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సముదాయించి వెనక్కి తీసుకువచ్చారు. అయినా, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్ వెనక్కి రాకుండా హడావుడి చేశారు. 14 నిమిషాలపాటు కొనసాగిన గవర్నర్ ప్రసంగానికి చివరికంటా టీడీపీ, కాంగ్రెస్‌లు అడ్డుతగిలాయి. కాగా, బీజేపీ, ఎంఐఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సభ్యులు తమ సీట్లలోనే కూర్చుని ఉండిపోయారు.
గవర్నర్ మందలింపు
సభ ప్రారంభంలోనే జాతీయ గీతాలాపన సమయంలో నిరసనకు దిగిన సభ్యులను గవర్నర్ నరసింహన్ వారించే ప్రయత్నం చేశారు. ఇక తన ప్రసంగం ముగిశాక మరోసారి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మరోసారి టేబుళ్లు ఎక్కి నినాదాలు చేస్తుండడంతో గవర్నర్ వారివైపు వేలు చూపిస్తూ మందలించారు. దీంతో వారిద్దరు వెనక్కి తగ్గారు. చివరకు నరసింహన్ వెళ్లిపోతుండగా గవర్నర్ డౌన్ డౌన్ అంటూ కొందరు నినాదాలు చేశారు. ఇదే సమయంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు ‘గవర్నర్ జిందాబాద్’ అని ప్రతి నినాదాలు చేశారు.