జిల్లా కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ మరో దఫా జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది విభజనపై చర్చ జరగనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ ఈ సమావేశానికి హాజరయ్యారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. మరోవైపు ఉన్న వ్యవధిలోగా ఉద్యోగులు, వస్తువులు, వాహనాలను జిల్లాల మధ్య విభజించాల్సి ఉంది. ఈ రకమైన అన్ని విధివిధానాలపై సీఎం సమావేశంలో చర్చ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు దసరా దగ్గరపడుతుందటం, మరోవైపు ఇప్పటికే ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, సూచనలు నమోదవుతుండటంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఆన్లైన్ లో దాదాపు 31వేలకు చేరిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందనతో పాటు, రాజకీయంగా వస్తున్న విమర్శలకు సమాధానం ఎలా చెప్తారన్నది కూడా తేలాల్సి ఉంది.