Telangana Electricity Employees Joint Action Committee
-
TS: ఉద్యోగుల ధర్నా.. ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్‌శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. చట్టసవరణ బిల్లు ప్రవేశ పెడితే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరు విధుల్లో ఉండరని ప్రకటించిన ఉద్యోగులు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. చదవండి: Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
స్థానికత ఆధారంగానే విభజన జరగాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ)లు డిమాండ్ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాల్సిందేనని ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీఈఈజేఏసీ చైర్మన్ ఎన్.శివాజీ, టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు మింట్‌కాంపౌండ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా 582 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల ధర్నా ఉద్రిక్తం
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు సహా పలువురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు లైన్మెన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ కార్మికులను విధుల నుంచి తొలగించడంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ల తొలగింపునకు నిరసనగా బుధవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్‌సౌధ ముందు మహా ధర్నా నిర్వహించారు. దీంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ఆందోళన కారులతో పాటు, మద్దతుగా వచ్చిన జేఏసీ కన్వీనర్ రఘు, కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు నాగరాజు, కృష్ణయ్య సహా కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది జూనియర్ లైన్మెన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటే 2009లో సీమాంధ్ర ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపారని ఆరోపించారు. తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయంపై త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.