విద్యుత్ ఉద్యోగుల ధర్నా ఉద్రిక్తం
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు సహా పలువురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు లైన్‌మెన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ కార్మికులను విధుల నుంచి తొలగించడంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మెన్ల తొలగింపునకు నిరసనగా బుధవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్‌సౌధ ముందు మహా ధర్నా నిర్వహించారు. దీంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ఆందోళన కారులతో పాటు, మద్దతుగా వచ్చిన జేఏసీ కన్వీనర్ రఘు, కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు నాగరాజు, కృష్ణయ్య సహా కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది జూనియర్ లైన్‌మెన్‌లను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటే 2009లో సీమాంధ్ర ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపారని ఆరోపించారు. తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయంపై త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.