ఐసెట్‌లో 95.55 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన కేయూ వీసీ చిరంజీవులు
- రాష్ట్ర విద్యార్థులకు టాప్-10లో 7 ర్యాంకులు
- రెండో ర్యాంకు సాధించిన మహారాష్ట్ర విద్యార్థి
- 3 నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 19న నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కాకతీయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ టి.చిరంజీవులు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 95.55 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. 72,474 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా, 66,510 మంది పరీక్షకు హాజరయ్యారని, అందులో 63,549 మంది అర్హత సాధించారని తెలిపారు. 154 మార్కులతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన విద్యార్థి గాజుల వరుణ్ మొదటి ర్యాంకు సాధించినట్లు వివరించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన విద్యార్థి వివేక్ విశ్వనాథన్ అయ్యర్ రెండో ర్యాంకు సాధించాడు. ఫైనల్ కీని వెబ్సైట్లో (www.tsicet.org)అందుబాటులో ఉంచినట్లు చిరంజీవులు తెలిపారు. విద్యార్థులు జూన్ 3 నుంచి ర్యాంకు కార్డులను వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ తర్వాత ఐసెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని, ప్రవేశాల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేస్తుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ తెలిపారు. గతేడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలో 347 కాలేజీలు ఉండగా, వాటిలో 41,796 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అందులో 49 ఎంసీఏ కాలేజీల్లో 2,966 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అయితే గతేడాది వాటిలో 60 నుంచి 70 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు పేర్కొన్నారు. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ తర్వాతే ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్నది తేలుతుందని చెప్పారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ కరువైన నేపథ్యంలో ఎంబీఏలో ప్రవేశాల కోసమే పరీక్ష నిర్వహించే అంశాన్ని ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తోందని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.