ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసన సభ్యుల కోటాలో నవంబర్ 22న శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డితో ప్రొటెమ్ చైర్మన్ వెన్న వెరం భూపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి హాజరై నూతన సభ్యులను అభినందించారు.
కొత్త సభ్యులకు రూల్స్ బుక్, గుర్తింపు కార్డులతో కూడిన బ్యాగ్‌ను వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత కొత్త సభ్యులతో కలిసి ప్రొటెమ్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు గ్రూప్ ఫోటో దిగారు. కాగా శాసనసభ్యుల కోటాలో మండలికి ఎన్నికైన మరో సభ్యుడు బండా ప్రకాశ్ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి.. రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ రాజీనామా పత్రాన్ని అందజేశారు. 4వ తేదీ నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బండా ప్రకాశ్‌తో పాటు గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయిన సిరికొండ మధుసూదనాచారి ఈ నెల 6న శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేస్తారు.
కేంద్రం వైఖరి అసంబద్ధం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, కేంద్రం దిగివచ్చేంత వరకు విశ్రమించేది లేదన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడం బీజేపీ, కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని, ఈ రెండు పార్టీల నాయకులు బేవకూఫ్‌లు అని కడియం శ్రీహరి దుయ్యబట్టారు.
ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి మరింత బాధ్యతతో పనిచేస్తానని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కరీంనగర్‌లోని రెండు స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.