Telangana National Integration Day
-
‘చరిత్ర నుంచి అనుభవాలు నేర్చుకోవాలి.. ఏమరపాటు ఏమాత్రం వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్బంగా అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. కాగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 15 రోజుల పాటు ఘనంగా వజ్రోత్సవాలు జరిపాము. వేడుకలకు కొనసాగింపుగా సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాము. రాచరికం నుండి ప్రజాస్వామ్యం దిశగా తెలంగాణ నడిచింది. ఎందరో అమరయోధులు ప్రాణత్యాగం చేశారు. రాజరిక వ్యవస్థ నుంచి పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం మొత్తం పోరాడింది. అమరవీరులను తలచుకోవడం మన కర్తవ్యం. ఆనాడు ఉజ్వల ఉద్యమం జరిగింది. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేం. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందాం. నాటి పాలకుల కృషివల్లే భారతదేశం రూపుదిద్దుకుంది. దేశంలో తెలంగాణ అంతర్భాగమయ్యాక సొంత రాష్ట్రంగా మారింది. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యింది. సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాడింది. తెలంగాణ లక్ష్యం సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో చిగురించింది. అద్భుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అన్ని రంగాల్లో అనేక అద్భుతాలను ఆవిష్కరించాము. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాము. ప్రతీ ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తున్నాము. జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. పలు రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నాటి చరిత్ర నుండి అనుభవాలు నేర్చుకోవాలి. అటువంటి వేదన మళ్లీ తెలంగాణకు రాకూడదు. మతతత్వ శక్తులు తెలంగాణను విభజించే కుట్ర చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోతాము. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలి. విష వ్యాఖ్యలతో మంటలకు ఆజ్యం పోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చదవండి: హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది? -
అది బీజేపీ అంటే.. కేసీఆర్‌కు చెమటలు పడుతున్నాయి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం జరపాలని సూచించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎంపై ఫైరయ్యారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న విమోచన దినం ఇన్ని రోజులు ఎందుకు జరుపలేదు. మేము ఎన్నో ఏళ్లుగా విమోచన దినోత్సవం కోసం పోరాడుతున్నాము. కేంద్రం అధికారికంగా విమోచన దినం జరుపుతామన్నాకే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఉద్యమ సమయంలో విమోచన దినం జరపాలని కేసీఆర్ ఎందుకు అన్నారు. ఇప్పుడెందుకు సమైక్యత రాగం ఎత్తుకున్నారు. ఒవైసీ కుటుంబం నుంచి వచ్చిన ఆదేశాలనే కేసీఆర్ పాటిస్తున్నారు. దారుస్సలాం ఆదేశాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపాల్సిందే. అసద్దుదీన్ ఒవైసీ చేతిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కీలుబొమ్మలు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామన్నాకే ఇప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అని కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. అంతుమందు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా వజ్రోత్సవాల వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఇక, ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 17పై ఫుల్ సస్పెన్స్.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు