Telugu Association of America
-
ఆత్మగౌరవమే అటా నినాదం
సిటీబ్యూరో: తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, అన్ని రంగాల్లో వారి అభ్యున్నతే లక్ష్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ పాతికేళ్ల క్రితం పురుడు పోసుకుందని అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు ఏసీరెడ్డి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పాతికేళ్ల ప్రస్థానంలో అటా తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషిచేస్తోందని, వివిధ రంగాల్లో ప్రతిభగల కళాకారులకు చేయూతనందిస్తోందని తెలిపారు. జూలై 1, 2016 నుంచి అటా రజతోత్సవాలను అమెరికాలోని చికాగోలో వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. నగర పర్యటనలో ఉన్న ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మనోగతం ఇదిగో.. రజతోత్సవాలకు సన్నాహాలు.. అమెరికాలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అమెరికా తెలుగు అసోషియేషన్(అటా). ఇది ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ రక్షణ కోసం 1991లో ఏర్పడింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. 2016 జూలై 1 నుంచి ప్రారంభమై జూలై 3 వరకు చికాగో నగరంలో ఉత్సవాలు జరగనున్నాయి. వీటిని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం.అటా ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకో మారు చొప్పున ఇప్పటి వరకు 11 సభలు జరుపుకుంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే సభ 12వది. ఈ సందర్భంగా ‘అమెరికా భారతి’ పేరుతో ప్రత్యేక సంచికను విడుదల చేస్తున్నాం. ఇందులో తెలుగు భాష, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం, సంప్రదాయాలు, విభిన్న రంగాల్లో లబ్దప్రతిష్టుల ఇంటర్వ్యూలు, మనోగతాలను ప్రచురించనున్నాం. సేవా కార్యక్రమాలకు 20 బృందాలు.. ఈ ఏడాది డిసెంబరులో డిసెంబర్ 3 నుంచి 20 వరకు 20 ఎన్ఆర్ఐ బృందాల సభ్యులు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. డిసెంబరు 19న ‘సేవ్ గర్ల్ చైల్డ్’ పేరుతో నెక్లెస్ రోడ్డులో 5కే రన్, 20న శిల్పకళావేదికలో సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇందులో ఒక్కో విభాగం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి వారిని చికాగోలో జరిగే ఉత్సవాలకు తీసుకెళ్తాం. ఆసక్తి గల వారు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అటావరల్డ్.ఓఆర్‌జి’ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థుల కోసం ఓ వెబ్సైట్ అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులకు ప్రత్యేక గెడైన్స్ ఇచ్చేందుకు వెబ్‌సైట్‌ను అటా ప్రారంభించింది. విద్యార్థులెవరైనా ‘ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎట్‌దిరేట్ అటావరల్డ్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఆయా అంశాల్లో అవగాహన కోసం డిసెంబరు 20న అమెరికాలోని ప్రతిష్టాత్మక కళాశాలల వివరాలను అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో రవీంద్ర భారతిలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. -
దేశానికి పంగనామాలు పెట్టొద్దు
తానా రెండో రోజు మహా సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదన్న జస్టిస్ ఎన్వీ రమణ డెట్రాయిట్: అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) మహాసభలు రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ సభలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మతం ఏదైనా, కులం ఏదైనా జనాలందరూ తమకు కావల్సినట్లు అడ్డనామమో, నిలువునామమో పెట్టుకోండిగానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దని అన్నారు. భారతీయ విధానాల్లో సైన్స్ నిగూఢంగా దాగుందన్నారు. ధ్యానం దేవుడితో మాట్లాడే వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మాట్లాడుతూ 36.5 కోట్ల మంది యువతతో భారత్ నవయవ్వనంతో తొణికిసలాడుతోందని అన్నారు. తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదని, జపాన్, చైనా దేశాలు భాషనే ఆయుధంగా మలుచుకుని ప్రపంచ వాణి జ్యాన్ని శాసిస్తున్నాయని అందుకే అందరూ భాషను గుర్తించి గౌరవించాలని కోరారు. అనంతరం వెంకయ్య నాయుడు వేడుకల సావనీర్‌ను విడుదల చేశారు. చిత్తూరు ప్రవాసులు న్యూట్రిన్ సంస్థల ఉపాధ్యక్షురాలు అనితారెడ్డికి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో రాజకీయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరూ తనను మౌనముని అంటారని కానీ తనను తాను మహామౌనమునిగా పిలుచుకుంటానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సభలో చమత్కరించారు. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో నిర్మాత సురేశ్‌బాబు, ఏపీ స్పీకర్ కోడెల, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ , ఎంపీ సీఎం రమేశ్, ఏపీ మంత్రులు అయ్యనపాత్రుడు, కామినేని, పరిటాల, క్యూబాలో భారత రాయబారి రవి, పితాని, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీనటుడు వెంకటేశ్, నటులు నారా రోహిత్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
సత్వరాభివృద్ధికి సహకరిస్తాం
ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సహజ వనరులను ఉపయోగించుకుని సత్వర అభివృద్ధి దిశగా ఉభయ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన అమెరికా తెలుగు సంఘం(ఆటా) వేడుకల్లో భాగంగా నిర్వహించిన రాజకీయ వేదిక చర్చా కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు. మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రసమయి బాలకిషన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆటా వేడుకల్లో చివరగా ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమం, తెలంగాణ బోనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కాగా, వరంగల్ జిల్లా గర్మిళ్లపల్లికి చెందిన ఎన్ఆర్ఐ సుధాకర్ పెరికారీని ఈ వేడుకల్లోనే ఆటా నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2015 జనవరి నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. - షికాగో(అమెరికా) నుంచి సాక్షి ప్రతినిధి