‘ఔట్లుక్’ కార్టూన్‌పై నిరసన
ఇందిరాపార్కు వద్ద తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆందోళన
హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై అసభ్యకరంగా కార్టూన్ వేసి, కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ మ్యాగజైన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, గ్రూప్ వన్ ఆఫీసర్స్, సివిల్స్ అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. నోటికి మాస్కులు ధరించి, ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ఔట్లుక్ చర్యపై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అధికారి సాధు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ స్మితా సబర్వాల్‌పై ఔవుట్లుక్ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రధానమంత్రి నుంచి అవార్డును అందుకున్న ఉత్తమ అధికారిణి స్మితా సబర్వాల్ అని కొనియాడారు. ప్రతికా స్వేచ్ఛ పేరిట వ్యక్తుల స్వేచ్ఛను హరించడం సరికాదని, ఇది ఎల్లో జర్నలిజం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ (ఐపీఎస్), బలరాం, శైలజ (ఐఆర్ఎస్), రమణారెడ్డి (ఐఆర్పీస్), ఉదయనాథ్ (ఐఆర్ఎఎస్), రాహుల్ గౌలీకార్ (ఐఐఎస్), బాలలత (డిఫెన్స్), రవికుమార్ (డిఇఓ), నాగమునయ్య (ఎస్ఓ, అసెంబ్లీ), నరసింహన్ (ఎఎస్‌ఓ, సెక్రటేరియట్) లతో పాటు సివిల్స్ అభ్యర్థులు పాల్గొన్నారు.