మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే
‘రాగెన్నుల రాజ్జెం’కు రాసిన ముందుమాటలోంచి; ప్రచురణ: కృష్ణగిరి జిల్లా రచయితల సంగం; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు. రమేశ్ ఫోన్: +91 8500548142
కృష్ణగిరి జిల్లా రచయితల సంగం (కృష్ణ. ర. సం.) వారు వెలువరిస్తుండే పన్నెండో పొత్తం ఇది. ‘మొరసునాడు కతలు’ పేరుతో వస్తుండే రెండో కూర్పు ఇది. మొరసునాడు ఇప్పటి ఆంధ్ర, కర్నాటక, తమిళనాడులలో మూడు ముక్కలయి నిలిచి ఉంది. చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి పెనువంటెం(జిల్లా)లలో కొంత కొంత; కోలారు, చిన్నబళ్లాపురం, బెంగళూరు నగర, గ్రామ పెనువంటెంలను కలిపితే మొరసునాడు అవుతుంది. మొరసునాడులో నూటికి ఏబయిమంది తెలుగు వాళ్లు ఉంటారు.
ఇందులో తమిళనాడుముక్క వాళ్లవి ఆరు కతలుండాయి. ఆంధ్రముక్క వాళ్లవి అయిదు కతలుండాయి. కర్నాటకముక్క నుండి తీసుకొనింది నాలుగు కతల్ని. మూడు ముక్కలయి మూడునాడుల్లో ఉండినా, ఈ తావు బతుకూ బాళూ అంతా ఒకటే. ఈ తావు వాళ్లకి ముక్కెమయిన తిండిపంట రాగులు. వరసగా నాలుగు నాళ్లు రాగిసంగటి దొరకకపోతే వేసట పడిపోతారు. ఈ పదైదు కతలలో రాగిముద్దను తలుచుకోని కతే లేదు.
మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే అని చెప్పదలుచుకొంటిమి. దానికే మూడు ముక్కల కతలన్నీ కలగలిపి కూరిస్తిమి. ఈ కూర్పులోని పదైదుమంది రచయితలలో తొమ్మిదిమంది తెలుగువాళ్లు, నలుగురు కన్నడిగులు, ఇద్దురు తమిళులు. పదైదుమందిలో ఆరుగురు దళితులు, ఏడుగురు వెనకబడిన తరగతుల వాళ్లు, ఇద్దురు రైతుబిడ్డలు. దానికే కావచ్చు ఈ కతలన్నీ మన్ను మణము(సువాసన)తో నిండి ఉండాయి. ఏలుబడులు మూడుముక్కలు చేసిన మమ్మల్ని నానుడు(సాహిత్యా)లు అతుకుతుండాయి. రండి, మా రాగెన్నుల రాజ్జెం మీకు ఎదురుకోలు పలుకుతా ఉంది.
- స.వెం.రమేశ్
రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం
(‘కథ-2015’కు రాసిన సంపాదకీయంలోంచి; ప్రచురణ: కథాసాహితి; పేజీలు: 206; వెల: 65; ప్రతులకు: 164, రవి కాలనీ, తిరుమలగిరి, సికింద్రాబాద్-15; ఫోన్: 9849310560)
సాహిత్య సృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలన సూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (్టజ్ఛి ్ఛ్ట్ఛట్చ జీ ్టజ్ఛి ఝ్చ), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు.
సాహిత్య సృజన వివిధ ప్రక్రియ(జ్ఛట్ఛ)లలో సాగుతుంది. కథ వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవంలోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్తకోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్శ్వం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా.
- ఆడెపు లక్ష్మీపతి