ఆత్మగౌరవమంటే బాబుకు తెలుసా?
మైలవరం, న్యూస్‌లైన్ : తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ.. నేడు ఆత్మగౌరవం లేని చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఉండడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ మైలవరం సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు చెప్పారు. సోమవారం ఆయన న్యూస్‌లైన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన స్వప్రయోజనాల కోసం పార్టీ పరువును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టిన చంద్రబాబు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సమైక్యవాదానికి మద్దతు ప్రకటించడాన్ని గమనిస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకు దండం పెట్టిన చరిత్ర గుర్తుకొస్తుందన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు హైటెక్ పాలనంటూ ఖజానా సొమ్మం అంతా హైదరాబాద్‌లో ఫ్లయ్‌ఓవర్ల నిర్మాణాలు, హైటెక్ భవన నిర్మాణాలకు ఖర్చుచేసి, ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందని మొసలికన్నీరు కార్చడమెందుకో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నిర్ణయ ప్రకటన రాగానే కొత్త రాజధాని నిర్మాణం కోసం
రూ. నాలుగు లక్షల కోట్లు కేటాయించాలని కోరి చంద్రబాబు అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను బాబు వెనక్కితీసుకున్న తర్వాతే సీమాంధ్రలో పర్యటించాలని జ్యేష్ఠ డిమాండ్ చేశారు. అసలు లేఖ ఎందుకు ఇచ్చిందీ, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని ఎందుకు అడిగిందీ, విభజన ప్రకటన చేసిన తర్వాత కూడా నోరు మెదపకుండా నెల రోజులకు పైగా ఇంట్లోనే ఎందుకు ఉన్నదీ, అలాగే ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబును జ్యేష్ఠ డిమాండ్ చేశారు.