Tempered Glass
-
100 కోట్లతో లెమన్ మొబైల్స్ టెంపర్డ్ గ్లాస్ ప్లాంటు!!
న్యూఢిల్లీ: లెమన్ మొబైల్స్ తాజాగా యాడ్సన్ ఇంపెక్స్ భాగస్వామ్యంతో రూ.100 కోట్లతో భారత్‌లో టెంపర్డ్ గ్లాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘‘గత నెలలో తయారీ యూనిట్‌ను, ఆర్అండ్డీ ఫెసిలిటీని ఆవిష్కరించాం. మొబైల్ పరిశ్రమలో మరింత విస్తరించేందుకు గ్లాస్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం’’ అని లెమన్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ చుగ్ తెలిపారు. నెలకు రెండు కోట్లకుపైగా మొబైల్ టెంపర్డ్ గ్లాస్‌ల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. హరియాణాలోని కుండ్లి ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, సెప్టెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. టెంపర్డ్ గ్లాస్ ప్లాంటు వల్ల 3,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. -
చైనాకు 'టెంపర్' తెప్పించే పని
న్యూఢిల్లీ: చైనా దిగుమతులను అరికట్టే దిశగా భారత్ మరో నిర్ణయాన్ని తీసుకుంది. మొబైల్ ఫోన్లకు రక్షణగా ఉపయోగించే టెంపర్డ్ గ్లాస్లపై దిగుమతి నిరోధక సుంకాన్ని(యాంటీ డంపింగ్ డ్యూటీ) విధిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ధర టెంపర్డ్ గ్లాస్‌ల విషయంలో దేశీయ పరిశ్రమలను రక్షించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చైనా నుంచి దిగుమతి అయ్యే టెంపర్డ్ గ్లాస్లపై టన్నుకు 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల మేర సుంకాన్ని విధించనున్నట్లు పేర్కొంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న టెంపర్డ్ గ్లాస్లు సాధారణ ధర కంటే తక్కువకే వస్తున్నట్లు యాంటీ డంపింగ్ అండ్ అలైడ్ డ్యూటీస్ (డీజీఏడీ) డైరెక్టరేట్ జనరల్ దర్యాప్తులో తేలింది. దీంతో దేశీయ పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రభుత్వం గ్రహించింది. స్వదేశీ పరిశ్రమలను కాపాడే లక్ష్యంగా దిగుమతి నిరోధక సుంకం విధిస్తున్నట్లు నోటిఫికేషన్లో రెవెన్యూ శాఖ పేర్కొంది. వచ్చే ఐదేళ్లు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై చైనా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.