పాక్ రాజధానిలో హిందూ ఆలయం!
పాకిస్థాన్ అంటేనే పక్కా హిందూ వ్యతిరేక దేశం అని అంతా అనుకుంటారు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతం వాళ్లు బతకగలిగే పరిస్థితి కూడా ఉండదని చెబుతారు. కానీ అలాంటి చోట.. అది కూడా పాక్ రాజధాని నగరమైన ఇస్లామబాద్‌లో తొలిసారిగా ఓ హిందూ ఆలయం, హిందువుల కోసం శ్మశానవాటిక కట్టాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ ఒకటి సూచించింది. ఇస్లామాబాద్‌లో ఇంతవరకు ఒక్క హిందూ ఆలయం కూడా లేదని, అక్కడ హిందువులు ఉన్నా, వారి ఇళ్లలో తప్ప ఆలయానికి వెళ్లి పూజలు చేసుకునే పరిస్థితి లేదని మత వ్యవహారాలపై జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సబ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రమేష్ లాల్ చెప్పారు. అలాగే హిందువులకు శ్మశాన వాటిక కూడా లేదన్న విషయం తెలిసి కమిటీ సభ్యులు షాకయ్యారు. ఇస్లామబాద్‌లో సుమారు 500 మంది హిందువులు ఉంటారు. వాళ్ల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం రావల్పిండి వెళ్తారని కమిటీ సమావేశంలో తెలిపారు.
దేశంలో మైనారిటీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇంత దారుణంగా ఉందని రమేష్ లాల్ చెప్పారు. నగరంలో కనీసం ఒక ఆలయం, ఒక శ్మశాన వాటిక ఉండటం ప్రతి మతస్థులకు ప్రాథమిక హక్కని ఆయన అన్నారు. నగరంలో హిందువుల ఆలయం ఉంటే శాంతిభద్రతల సమస్య వస్తుందేమోనన్న అభ్యంతరాలను ఈ కమిటీ తిరస్కరించింది. హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నప్పుడు ఆలయాలకు భద్రత కల్పించలేరా అని కమిటీ సభ్యుడొకరు అడిగారు. ఇస్లామాబాద్‌లో వెంటనే హిందూ ఆలయం, శ్మశాన వాటిక నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలని, అలాగే చర్చిల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కమిటీ సూచించింది. సయీద్పూర్ ప్రాంతంలో ఆలయానికి భూమి కేటాయించొచ్చని ప్రతిపాదించింది. పాకిస్థాన్ జనాభాలో హిందువులు, క్రిస్టియన్లు కలిపి మూడు శాతం ఉంటారు.