ten thousand runs
-
ఓవర్లో ఆరు సార్లయినా డైవ్ చేస్తా!
వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటడం సంతోషంగా ఉందని, అయితే ఇప్పటికీ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమిస్తానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. పదేళ్లు దాటినా పరుగులు సాధించడంలో ఉదాసీనత ఉండరాదని అతను అన్నాడు. బుధవారం వైజాగ్ వన్డేలో పది వేల పరుగులు పూర్తి చేసుకొని సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అనంతరం తన మనోభావాలను బీసీసీఐ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు. కోహ్లి స్పందన అతని మాటల్లోనే... ‘పది వేల పరుగులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేను ఎంతో అదృష్టవంతుడినని చెప్పగలను. నా వన్డే కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. సాధారణంగా అయితే నా దృష్టిలో ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లకు చోటు లేదు. అయితే పదేళ్లుగా ఆడుతూ ఇక్కడి దాకా చేరుకున్నామనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఇది అంత ప్రత్యేకమని చెప్పగలను. నేను ఈ ఆటను అమితంగా ప్రేమించడమే నా ఆనందానికి మరో కారణం. అలాంటి క్రికెట్‌ను ఇంకా ఇంకా ఆడాలని భావిస్తున్నా కాబట్టి ఇదో విశేషంగా భావిస్తున్నా. ఇంత సుదీర్ఘంగా ఆడగలగడం సంతృప్తిగా ఉంది. మరిన్ని సంవత్సరాలు దీనికి జత కావాలి. ఇంతటి ఘనతను సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. భారత్ తరఫున ఆడితే చాలనుకున్నాను. ఇంతటి చిరస్మరణీయ రోజు వస్తుందనే ఆలోచన కూడా నాకు రాలేదు. మనం ఏం చేసినా దానిపైనే శ్రద్ధ పెట్టి సరైన దారిలో శ్రమించాలని మాత్రం తెలుసు. ఇలాంటి రికార్డులు కొంత కాలం తర్వాత చూస్తే ప్రాధాన్యత లేనివిగా కనిపిస్తాయి. పరుగులు చేయడమే నాకు తెలిసిన విద్య. సుదీర్ఘ కాలంగా దానిని పూర్తి చేసే క్రమంలోనే ఇలాంటి ఘనత దక్కింది. ప్రతీ మ్యాచ్‌లో జట్టు కోసం, జట్టు అవసరాలకు అనుగుణంగా భారీ స్కోరు కోసం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నాకు తెలుసు.భవిష్యత్తుల్లో కూడా ప్రతీ మ్యాచ్, ప్రతీ పరిస్థితుల్లో అలాంటి పరుగులు చేయాలనుకుంటున్నా. శారీర కంగా, మానసికంగా కూడా నా శక్తియుక్తులు జట్టు కోసం పరుగులు సాధించేందుకు వెచ్చించాను. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూ బ్యాట్‌తో నా పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నా ఒక్కడి గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి రికార్డులు రాకపోయేవేమో. బయటి నుంచి చూసేవారికి ఇదంతా మామూలుగానే కనిపించవచ్చు. కానీ కఠిన పరిస్థితులు ఎదురైన సమయంలో జట్టు కోసం తీవ్రంగా శ్రమించడం, మరో 10–12 ఓవర్లు అదనంగా ఆడితే వచ్చే పరుగులతో భారీ స్కోరుకు సహకరించడం ఎంతో ముఖ్యం. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. అయితే పదేళ్ల తర్వాత కూడా దానిని నాకు లభించిన ప్రత్యేక హక్కుగా భావించడం లేదు. ఇప్పటికీ ప్రతీ పరుగు కోసం నేను కూడా తీవ్రంగా శ్రమించాల్సిందే. ఎందుకంటే భారత జట్టులో ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు పరుగులు చేసే విషయంలో అదే ఆకలి, తపన ఉండాలి. ఏ విషయంలోనూ ఉదాసీనత కనబర్చకుండా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాలి. పరుగు పూర్తి చేసే క్రమంలో ఒకే ఓవర్లో ఆరు సార్లు డైవ్ చేయాల్సి వచ్చినా నేను వెనుకాడను. ఎందుకంటే నేను దేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యాను. అది నా బాధ్యతతో పాటు ఉద్యోగ ధర్మం కూడా. ఇలా నేను ఎవరికి మేలు చేయడం కోసమో ఆడటం లేదు. పైగా ఎవరి కోసమో నేను నిరూపించాల్సిన పని లేదు.నా శ్రమంతా ఆ అదనపు పరుగు కోసమే. నేను శారీరకంగా లేదంటే మానసికంగా అలసిపోయానని చెప్పి ఆ పరుగు తీయకుండా ఉండలేను. జట్టుకు ఉపయోగపడేందుకు ఏం చేయాల్సి వచ్చినా ఎప్పుడైనా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను’ -
రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ (డబ్లిన్) : టీమిండియా తాము ఆడిన100వ టీ20 మ్యాచ్‌లో భారీ విజయం సాధించగా.. భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20లో భాగంగా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా.. పదివేల పరుగుల మైలురాయి(10, 022 పరుగులు)ని అధిగమించాడు. ఐర్లాండ్‌తో నిన్నటి మ్యాచ్‌కు ముందు 9,925 పరుగులతో ఉన్న రోహిత్, ఆ మ్యాచ్‌లో 75 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే భారత ఓపెనర్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది. పదివేల పరుగుల క్లబ్లో చేరిన అతికొద్దిమంది ఓపెనర్ల జాబితాలో రోహిత్‌కు చోటు లభించింది. మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, టీ20లు)లో కలిపి రోహిత్ ఈ ఘనత సాధించాడు. రోహిత్ టెస్టుల్లో 1,479 పరుగులు, వన్డేల్లో 6,594 పరుగులు, టీ20ల్లో 1,949 పరుగులు సాధించాడు. వన్డేల్లో 17 శతకాలు బాదిన రోహిత్.. టెస్టుల్లో 3, టీ20ల్లో 2 సెంచరీలు బాదాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అరుదైన ఆటగాళ్లలో రోహిత్ ఒకడు కాగా.. మూడుసార్లు ఈ ఫీట్ నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా భారత ఓపెనర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సచిన్ ఎవర్గ్రీన్ ఓవరాల్‌గా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరుగుల జాబితాలో 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులు (15,921), వన్డేల్లో (18,426) అత్యధిక పరుగుల రికార్డు సైతం సచిన్ పేరిటే ఉంది. సచిన్ తర్వాతి స్థానంలో కుమార సంగక్కర 28,016 పరుగులతో ఉన్నాడు. భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లు అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల క్లబ్లో ఉన్నారు. -
సచిన్ రికార్డు ఈజీగా బద్దలుకొడతా..
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ లో సంచలనం అలిస్టర్ కుక్. అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్ కుక్. ప్రపంచానికే క్రికెట్ నేర్పించిన దేశమైనప్పటికీ ఇప్పటివరకూ ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడికి టెస్టుల్లో పదివేల పరుగుల ఫీట్ సాధ్యపడలేదు. దశాబ్దాలుగా తమ జట్టు ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఫీట్ అందుకోవడానికి ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కేవలం 36 పరుగుల దూరంలో ఉన్నాడు. అతడు పగ్గాలు అందుకున్న తర్వాత జట్టులో ఎన్నో మార్పులు, మళ్లీ వారిలో జోష్ పెంచాడు. పదివేల పరుగుల క్లబ్ లో చేరిన 12వ ఆటగాడిగా, తొలి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ గానూ డబుల్ రికార్డులు సొంతం చేసుకోనున్నాడు. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొడితే వచ్చే మజానే వేరు అని డాషింగ్ బాట్స్ మెన్ అంటున్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పకనే చెబుతున్నాడు. కుక్ 126 టెస్టుల్లో 9,964 పరుగులు చేశాడు. ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్ ఈ నెలలో జరుగుతున్నందున మరికొన్ని రన్స్ జోడించి సచిన్ రికార్డును తిరగరాయడం తనకు అసాధ్యమేం కాదని పేర్కొన్నాడు.